తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేడు అసెంబ్లీలో గజ్వేల్ శాసనసభ్యునిగా ప్రమాణస్వీకారం చేశారు. ఇటీవల తుంటి శస్త్ర చికిత్స జరిగిన ఆయన చేతి కర్ర సహాయంతో తెలంగాణ అసెంబ్లీకి చేరుకున్నారు. బీఆర్ఎస్ ముఖ్య నేతలందరూ అసెంబ్లీ వద్ద కేసీఆర్ కు స్వాగతం పలికారు. ఆపై కెసిఆర్ అసెంబ్లీ స్పీకర్ ఛాంబర్ కు చేరుకున్నారు. అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కెసిఆర్ తో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయించారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గజ్వేల్ నియోజకవర్గం నుండి మూడు సార్లు జరిగిన శాసనసభ ఎన్నికలలో ఎమ్మెల్యేగా విజయం సాధించిన కెసిఆర్, రెండు పర్యాయాలు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పాలన నిర్వహించారు. ప్రస్తుతం ఎమ్మెల్యేగా, శాసనసభా పక్ష నేతగా తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్ష పాత్రను పోషించబోతున్నారు.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్న సమయంలో ఆయన అసెంబ్లీ గేట్ నెంబర్ వన్ ద్వారా రాకపోకలు సాగించారు. అయితే ఈరోజు కేసీఆర్ గేట్ నెంబర్ 2 ద్వారా ఆయన అసెంబ్లీకి రావడం గమనార్హం. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నేరుగా ఆయన ప్రతిపక్ష నేత కార్యాలయంలో పూజలు చేసి, శాసనసభాపక్ష నేతగా బాధ్యతలు చేపట్టారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా ఆయన ప్రతిపక్షనేతగా అసెంబ్లీలో అడుగుపెట్టారు.
ఈ కార్యక్రమంలో శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్‌బాబు, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావుతో పాటు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఇక ఇప్పుడిప్పుడే రాజకీయంగా కార్యక్రమాలలో పాల్గొంటున్న కేసీఆర్ అధికారికంగా నేడు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసి, ప్రజాక్షేత్రంలోకి దిగాలని నిర్ణయించారని సమాచారం.
ఇక లోక్సభ ఎన్నికల నేపథ్యంలో సుడిగాలి పర్యటనలు చేయాలని సంకల్పించిన కేసీఆర్ దీనికోసం రంగం సిద్ధం చేసుకున్నారని సమాచారం. అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి పాలైనా, లోక్ సభ ఎన్నికల్లో సత్తా చాటాలని, లోక్ సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు సాధిస్తేనే రాజకీయంగా మనుగడ ఉంటుందని కేసీఆర్ భావిస్తున్నారు.