తెలంగాణలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. లోక్ సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ వర్సస్ బీఆర్ఎస్ కొత్త వ్యూహాలు తెర మీదకు వస్తున్నాయి. బీఆర్ఎస్ నుంచి ముఖ్య నేతలను తమ వైపు తిప్పుకొనేందుకు కాంగ్రెస్ నాయకత్వం పావులు కదుపుతోంది. ఇప్పటికే కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను సీఎం రేవంత్ ను కలవటం పైన కొత్త ప్రచారం మొదలైంది. ఈ సమయంలోనే బీఆర్ఎస్ ముఖ్య నేత పార్టీ వీడి కాంగ్రెస్ లో చేరేందుకు సిద్దమయ్యారు.
బీఆర్ఎస్ నేత, స్టేషన్ ఘనపూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఆ పార్టీకి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. తెలంగాణ తొలి ఉపముఖ్యమంత్రిగా రాజయ్య పనిచేశారు. బీఆర్ఎస్ నుంచి స్టేషన్ ఘనపూర్ అసెంబ్లీ టికెట్ దక్కకపోవడంతో అప్పటి నుంచి ఆయన అసంతృప్తిగా ఉన్నారు.
స్టేషన్ ఘన్ పూర్ టికెట్ ను తాజా అసెంబ్లీ ఎన్నికల్లో కడియం శ్రీహరికి టికెట్ ఇచ్చారు.తన అనుచరులతో లోతుగా చర్చించిన తర్వాత పార్టీకి గుడ్ బై చెప్పడమే బెటర్ అనే నిర్ణయానికి ఆయన వచ్చారు. కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమైయ్యారు. ఇందుకు ముహూర్తం సైతం ఖరారు చేసుకున్నట్లు తెలుస్తోంది. పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ కు తన రాజీనామా లేఖ పంపినట్లు సమాచారం.
రాజయ్య ఇప్పటికే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో చర్చలు జరిపారు. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఆయన కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉంది. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో వరంగల్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్ది గా కడియం శ్రీహరి కుటుంబ సభ్యులకు ఛాన్స్ దక్కుతుందని ప్రచారం సాగుతోంది. ఎంపీగా పోటీ చేయాలని రాజయ్య భావిస్తున్నారు.
ఎమ్మెల్యే సీటు నిరాకరించి, ఇప్పుడు ఎంపీ సీటు ఇవ్వరని తేలటంతోనే ఆయన పార్టీ మారాలని నిర్ణయించినట్లు చెబుతున్నారు. గతంలో కాంగ్రెస్ లో పని చేసిన నేత కావటంతో ఢిల్లీలోని ముఖ్య నేతలతో చర్చించినట్లు సమాచారం. దీంతో, పార్లమెంట్ ఎన్నికలకు సిద్దం అవుతున్న వేళ రాజయ్య రాజీనామాతో వరంగల్‌లో రాజకీయ సమీకరణాలు మారనున్నాయి.