TELANGANA

బాల్క సుమన్‌పై క్రిమినల్ కేసులు నమోదు..

భారత్ రాష్ట్ర సమితి అధినేత, ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్‌పై ఘాటు విమర్శలు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై సర్వత్రా విమర్శలు చెలరేగుతున్నాయి. బీఆర్ఎస్ నాయకులు ఆయనపై మండిపడుతున్నారు. నిప్పులు చెరుగుతున్నారు. మాటలదాడికి దిగారు.

 

తాజాగా- బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, చెన్నూర్ మాజీ శాసన సభ్యుడు బాల్క సుమన్.. రేవంత్ రెడ్డిపై రెచ్చిపోయారు. ఘాటు విమర్శలు చేశారు. అనేక ఆరోపణలను సంధించారు. ముఖ్యమంత్రిని ఏకవచనంతో సంబోధిస్తూ ఎదురుదాడికి దిగారు. కాంగ్రెస్‌ పార్టీకి పెద్ద పాలేరుగా అభివర్ణించారు.

మంచిర్యాల నియోజకవర్గం సమీక్ష సమావేశంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కేసీఆర్‌పై విమర్శలు చేసిన రేవంత్ రెడ్డి అంశాన్ని బాల్క సుమన్ ప్రస్తావించారు. ఎన్నో ఏళ్ల పాటు పోరాడి, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్‌ను రేవంత్ రెడ్డి రండగా చెప్పడాన్ని తప్పుపట్టారు.

రేవంత్ రెడ్డిని చెప్పు తీసుకుని కొడతానంటూ బాల్క సుమన్ హెచ్చరించారు. అసభ్య పదజాలంలో విరుచుకుపడ్డారు. తమకు సంస్కారం అడ్డుగా వస్తోందని వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డీ ఖబడ్దార్ అంటూ సవాల్ విసిరారు. తమ ప్రభుత్వం లేకపోయినా సరే.. కేసీఆర్ జోలికి వస్తే తొక్కి పడేస్తాం అంటూ హెచ్చరించారు.

 

రేవంత్ రెడ్డిపై ఘాటు పదజాలంతో విమర్శలు గుప్పించిన బాల్క సుమన్‌పై క్రిమినల్ కేసులు నమోదు అయ్యాయి. రేవంత్ రెడ్డిని దూషించారంటూ పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఆయనపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా బాల్క సుమన్‌పై ఐపీసీలోని 294-బీ, 504, 506 కింద కేసులు పెట్టారు.