TELANGANA

నీటి పారుదల శాఖలో భారీప్రక్షాళన..

నీటి పారుదల శాఖలో కాంగ్రెస్ ప్రభుత్వం భారీ ప్రక్షాళన చేపట్టింది. మేడిగడ్డపై విజిలెన్స్ నివేదిక ఆధారంగా ఇంజినీర్లపై చర్యలు చేపట్టింది. రామగుండం ఈఎన్‌సీ వెంకటేశ్వర్లును తొలగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు, ఈఎన్‌సీ జనరల్ మురళీధర్ రావును రాజీనామా చేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. మరికొందరు ఇంజినీర్లపైనా వేటుకు రంగం సిద్ధమైనట్లు సమాచారం.

 

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలపై ప్రత్యేక దృష్టి సారించిన విషయం తెలిసిందే. కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ ఆనకట్ట కుంగిన నేపథ్యంలో విజిలెన్స్ విచారణకు కూడా ఆదేశించారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి ప్రాథమిక నివేదికను విజిలెన్స్ అధికారులు అందించారు. కాగా, గురువారం నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానుంది.

 

అసెంబ్లీ సమావేశాల్లో నీటిపారుదల శాఖకు సంబంధించి శ్వేతపత్రం విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం నీటి పారుదల శాఖలో కీలక అధికారులపై చర్యలు తీసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. పదవీ విరమణ చేసిన తర్వాత కూడా సర్వీసులో కొనసాగుతున్న ఈఎన్సీ మురళీధర్ రావును రాజీనామా చేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశారు.

 

రామగుండం ఈఎన్సీగా ఉండటంతోపాటు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు, పంప్ హౌస్‌లకు సంబంధించిన పనులను పర్యవేక్షిస్తున్న వెంకటేశ్వర్లును సర్వీసును తొలగిస్తూ ప్రభుత్వం తీవ్ర నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఇక, రేపట్నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో కాళేశ్వరం ప్రాజెక్టు అంశం కీలకంగా చర్చ జరిగే అవకాశం ఉంది. ఇందుకోసం అధికార, ప్రతిపక్షపార్టీల సభ్యులు సిద్ధమైనట్లు తెలుస్తోంది