TELANGANA

రైతు రుణమాఫీ, గ్యారంటీల అమలు పై బడ్జెట్ లో భట్టి కీలక ప్రకటన..!

ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క శాసనసభలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. మొత్తం రూ.2,75,891 కోట్లతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఇందులో రెవెన్యూ వ్యయం రూ.2,01,178 కోట్లు కాగా.. మూలధన వ్యయం రూ.29,669 కోట్లుగా పేర్కొన్నారు. ఆరు గ్యారెంటీల అమ‌లుకు రూ. 53,196 కోట్లు ప్ర‌తిపాదించిన‌ట్లు మంత్రి పేర్కొన్నారు. రైతుల రుణ‌మాఫీపై కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ప్ర‌తి పంట‌కు మ‌ద్ద‌తు ధ‌ర కూడా అందిస్తామ‌ని భట్టి తన ప్రసంగంలో స్పష్టం చేసారు.

 

బడ్జెట్ ప్రతిపాదనలు : తెలంగాణ ప్రభుత్వం తాజాగా ప్రతిపాదించిన బడ్జెట్ లో పలు కీలక అంశాలను ప్రస్తావించింది. రెవెన్యూ వ్యయం రూ.2,01,178 కోట్లు, మూలధన వ్యయం రూ.29,669 కోట్లుగా ఉన్నట్టు మంత్రి పేర్కొన్నారు. కీలకమైన విద్యారంగానికి బడ్జెట్‌లో రూ. 21,389 కోట్లు కేటాయించారు. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల అమ‌లుకు రూ. 53,196 కోట్లు ప్ర‌తిపాదించిన‌ట్లు మంత్రి పేర్కొన్నారు. ఈ కేటాయింపు ఒక ప్రాథ‌మిక అంచ‌నా ప్ర‌కారం మాత్ర‌మే చేయ‌డం జ‌రిగింద‌న్నారు. హామీల‌కు సంబంధించిన విధివిధానాల‌ను రూపొందించే ప‌ని ఇంకా కొన‌సాగుతున్నందున‌, అది పూర్త‌యిన వెంట‌నే అమ‌లుకు అవ‌స‌ర‌మైన పూర్తి నిధులు కేటాయిస్తామని విక్ర‌మార్క తెలిపారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌తోపాటు స్కాలర్ షిప్‌లను సకాలంలో అందజేస్తామన్నారు.

 

రుణమాఫీ పై క్లారిటీ : బడ్జెట్ ప్రసంగంలో రైతుల రుణ‌మాఫీపై భ‌ట్టి విక్ర‌మార్క కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఎన్నిక‌ల ముందు ప్ర‌జ‌ల‌కు హామీ ఇచ్చిన విధంగానే రైతు రుణ‌మాఫీ ప‌థ‌కాన్ని అమ‌లు చేయ‌బోతున్నామ‌ని తెలిపారు. రూ. 2 లక్ష‌ల రుణ‌మాఫీపై త్వ‌ర‌లోనే కార్యాచ‌ర‌ణ ఉంటుంద‌ని స్ప‌ష్టం చేశారు. అందుకు విధివిధానాల‌ను రూపొందిస్తున్నాం. ప్ర‌తి పంట‌కు మ‌ద్ద‌తు ధ‌ర కూడా అందిస్తామ‌న్నారు. తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఓయూతోపాటు రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లో మౌలిక సదుపాయాలకు రూ.500 కోట్లు కేటాయించారు. రాష్ట్రంలో రైతులకు 24 గంటలపాటు కరెంట్ అందించనున్నట్టు చెప్పారు. గృహ జ్యోతి కింద 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇస్తామని తెలిపారు. ఇందుకోసం రూ.2,418 కోట్లు కేటాయిస్తున్నట్టు పేర్కొన్నారు.

 

కేటాయింపులు ఇలా : రాష్ట్రంలో ట్రాన్స్‌కో, డిస్కమ్‌లకు రూ.16,825 కోట్లు కేటాయించినట్టు చెప్పారు. అలాగే ఈ ఈ బడ్జెట్‌లో గృహనిర్మాణ శాఖకు రూ.7,740 కోట్లు కేటాయించినట్టు తెలిపారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగ పరీక్షలను నిర్వహించే టీఎస్‌పీఎస్సీకి బడ్జెట్‌లో రూ.40 కోట్లు కేటాయించినట్టు మంత్రి తెలిపారు. త్వరలోనే మెగా డీఎస్సీ ఉంటుందని మంత్రి చెప్పారు. త్వరలో 15 వేల కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ చేసి, నియామక పత్రాలు ఇస్తామని, గ్రూప్ -1లో 64 ఉద్యోగాలని చేర్చి భర్తీ చేయబోతున్నట్టు భట్టి విక్రమార్క తెలిపారు. ఇళ్లు లేనివారికి ఇల్లు, స్థలం ఉంటే ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షల సాయం చేయనున్నట్టు చెప్పారు. ఇందుకోసం కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి ఇవ్వబోతున్నామని భట్టి విక్రమార్క వెల్లడించారు.