లోక్‌సభ ఎన్నికలు దగ్గరపడుతున్న క్రమంలో తెలంగాణ బీజేపీ ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతోంది. రాష్ట్రంలోని అన్ని ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు. అంతేగాక, విజయ సంకల్ప యాత్రలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 1025 కిలోమీటర్ల మేర ఐదు బస్సు యాత్రలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఆదివారం యాత్రకు సంబంధించిన పోస్టర్‌ను పార్టీ నేతలతో కలిసి రాష్ట్ర కార్యాలయంలో కిషన్ రెడ్డి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ఫిబ్రవరి 20 నుంచి మార్చి 4 వరకు ఈ బస్సు యాత్రలు కొనసాగుతాయన్నారు. ఆదిలాబాద్, పెద్దపల్లి, నిజామాబాద్ నియోజకవర్గాల్లో కొమురంభీం.. కరీంనగర్, మెదక్, జహీరాబాద్, చేవెళ్లలో శాతవాహన.. ఖమ్మం, వరంగల్, మహబూబాబాద్‌లో కాకతీయ.. మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, నల్గొండలో కృష్ణమ్మ.. భువనగిరి, మాల్కాజిగిరి, హైదరాబాద్, సికింద్రాబాద్‌లో భాగ్యనగర పేరిట యాత్రలు చేస్తామని వివరించారు.
పదేళ్లలో ప్రధాని మోడీ ప్రభుత్వం సాధించిన విజయాలు, ప్రతిపక్షాల వైఫల్యాలను ప్రజలకు వివరిస్తామని కిషన్ రెడ్డి తెలిపారు. తెలంగాణలో 17 సీట్లు ఖచ్చితంగా గెలుస్తామన్నారు. హైదరాబాద్‌లో ఎంఐఎంను మట్టికరిస్తామని ధీమా వ్యక్తం చేశారు. మండల, నియోజకవర్గాల వారీగా రోడ్‌షోలు ఉంటాయన్నారు. అన్ని యాత్రలు భాగ్యనగరంలో కలిసే విధంగా ప్రణాళిక చేశామని తెలిపారు.
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీకి మధ్యే పోటీ ఉంటుందని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. వచ్చే సార్వత్రిక ఎన్నికలు సుస్థిరత, అస్థిరతకు మధ్య జరగనున్నాయన్నారు. జాతీయ స్థాయిలో ఇప్పటి వరకూ ఒక్క ఎంపీ సీటూ ప్రకటించలేదన్నారు. ఇక, కృష్ణా జలాలపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు కూర్చుని మాట్లాడుకుంటే సరిపోతుందన్నారు. మేడిగడ్డ సందర్శనపై స్పందిస్తూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడక ముందే తాము బ్యారేజీని సందర్శించామని కిషన్ రెడ్డి తెలిపారు. ఇప్పుడు మళ్లీ వెళ్లాల్సిన అవసరం లేదన్నారు.