APTELANGANA

కేఏ పాల్-లక్ష్మినారాయణ. ఇదేం కాంబినేషన్‌?

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అక్కరలేని వ్యక్తి. ఆయన చాలా కాలంగా రాజకీయాలలో ఉన్నప్పటికీ రాణించలేకపోయారు.

కారణం అందరికీ తెలుసు. ఇక ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డిని అక్రమాస్తుల కేసులో 16 నెలలు జైల్లో కూర్చోబెట్టిన వ్యక్తి సీబీఐ మాజీ జేడీ లక్షినారాయణ. మితభాషి, మంచి సమర్దుడు, నిజాయతీపరుడు, రాష్ట్రం బాగుకోసం పరితపిస్తున్న వ్యక్తిగా ఆంధ్రా ప్రజలకు తెలుసు.

ఏ విషయంలోనైనా వీరిద్దరూ తూర్పు పడమరవంటివారే. కానీ వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ కోసం వారిద్దరూ కలిసి పనిచేయాలని నిర్ణయించుకొన్నారు. ఇదే విషయం వారిద్దరూ బుదవారం విశాఖపట్నంలో ప్రెస్‌మీట్‌ పెట్టి తెలియజేశారు.

ముందుగా కేఏ పాల్ మాట్లాడుతూ, “వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ ప్రయివేటీకరణ ప్రక్రియ ఇప్పటికే దాదాపు 99% పూర్తయిపోయింది. దానిని ఆపడం కోసం నేను ప్రధాని నరేంద్రమోడీ మొదలు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ వరకు అందరినీ కలిశాను. వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ అమ్మవద్దని ప్రధాని నరేంద్రమోడీని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, కేంద్రమంత్రులను నేను చాలా వేడుకొన్నాను. కానీ ఎవరూ నాగోడు పట్టించుకోలేదు. వేలకోట్లు ఖరీదు చేసే వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ని కేవలం రూ.3,500 కోట్లకు అమ్మేసేందుకు రంగం సిద్దం చేస్తోంది. కనుక దీనిని ఎలాగైనా ఆపాలని ప్రయత్నిస్తున్న నాతో లక్ష్మినారాయణ వచ్చి కలిశారు. ఇద్దరం కలిసి చివరివరకు పోరాడుతాము,” అని అన్నారు.

జేడీ లక్ష్మినారాయణ మాట్లాడుతూ, “కేఏ పాల్‌గారికి కేంద్రంలో ఉన్న పెద్దలతో పాటు దేశంలో అన్ని రాష్ట్రాలలో ముఖ్యమంత్రులు, పార్టీ అధినేతలతో పరిచయాలు ఉన్నందున, ఆయనతో కలిసి ప్రయత్నిస్తే వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ ప్రయివేటీకరణని ఆపగలమని భావిస్తున్నాను. ప్రస్తుతం వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ కింద ఉంది కనుక దానిని అమ్మేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అదే. స్టీల్‌ ఆధారిటీ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్న స్టీల్‌ ప్లాంట్లకు మాత్రం కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇస్తోంది.

రెండూ కేంద్ర ప్రభుత్వ సంస్థలే అయినప్పుడు ఓ సంస్థ అధీనంలో ఉన్న ప్లాంట్లను అమ్మివేయడం మరోదాని కింద ఉన్న ప్లాంట్లకు ప్రోత్సాహకాలు ఇవ్వడం ఏమిటి? వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ని కూడా స్టీల్‌ ఆధారిటీ ఆఫ్ ఇండియా కిందకు తీసుకొని దాని ఉత్పత్తిని పెంచాలని మేము డిమాండ్‌ చేస్తున్నాము. వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌కి అవసరమైన క్యాపిటివ్ మైన్స్ అందించి, ప్రోత్సహించాలి కానీ దశాబ్ధాల చరిత్ర కలిగిన వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ని అమ్మవద్దని, కేంద్ర ప్రభుత్వం తక్షణం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను,” అని అన్నారు.

ఇద్దరూ చాలా మంచిపని కోసమే చేతులు కలిపినప్పటికీ, వారు ఆలోచనలు, వ్యక్తిత్వాలలో చాలా తేడాలున్నందున ఈ కాంబినేషన్‌ ఎక్కువ కాలం వర్కవుట్ కాకపోవచ్చు.