TELANGANA

అసెంబ్లీలో ప్రాజెక్టులపై సమరం..

తెలంగాణ అసెంబ్లీ వేదికగా డైలాగ్ వార్ కొనసాగింది. కృష్ణానది మీద ఉన్న ప్రాజెక్టుల నిర్వహణను కేఆర్‌ఎంబీకి అప్పగించే ప్రసక్తేలేదంటూ రాష్ట్ర అసెంబ్లీలో ప్రభుత్వం తీర్మానం ప్రవేశపెట్టింది. దీని పైన చర్చ సమయంలో సీఎం రేవంత్, మంత్రులు వర్సస్ హరీష్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఏపీ సీఎం జగన్ ప్రస్తావన వచ్చింది. ఏపీకి ప్రయోజనం చేసేలా కేసీఆర్ వ్యవహరించారని కాంగ్రెస్ ఆరోపించింది. సీఎం, మంత్రుల వ్యాఖ్యలను మాజీ మంత్రి హరీష్ కౌంటర్ చేసారు.

 

అసెంబ్లీలో డైలాగ్ వార్:తెలంగాణలో కొద్ది రోజలుగా వివాదంగా మారిన ప్రాజెక్టుల నిర్వహణను కేఆర్‌ఎంబీకి అప్పగించే అంశం పైన ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రాజెక్టులను కేఆర్‌ఎంబీకి అప్పగించే ప్రసక్తేలేదంటూ తీర్మానం ప్రవేశ పెట్టింది. కృష్ణానది ప్రాజెక్టుల నిర్వహణ..ఒప్పందాల విషయంలో కేసీఆర్ తీసుకున్న నిర్ణయాల గురించి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ చర్చ సమయంలో సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు చేసారు. తెలంగాణకు కృష్ణానది జలాల అవసరం గురించి చెప్పుకొచ్చారు. కరీంనగర్ ప్రజలు తరిమికొడితే అక్కడి నుంచి పారిపోయి పాలమూరు జిల్లాకు వలస వస్తే అయ్యోపాపం అని వలస వచ్చారని ఆదరించి ఎంపీగా గెలిపిస్తే అటే పోయారంటూ మాజీ సీఎం కేసీఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. దీనికి హరీష్ కౌంటర్ ఇచ్చారు.

 

కాంగ్రెస్ వర్సస్ హరీష్:కొడంగల్ నుంచి పారిపోయి రేవంత్ మల్కాజ్ గిరికి వచ్చారా అని ప్రశ్నించారు. ఇదే సమయంలో సీఎం కేసీఆర్ పైనా రేవంత్ కీలక వ్యాఖ్యలు చేసారు. పాలమూరు జిల్లాకు సంబంధించిన కృష్ణా నది జలాల మీద చర్చ జరుగుతుంటే ఆ మహానుభావుడు (కేసీఆర్) ఇక్కడకు రాకుండా ఫామ్‌హౌస్‌లో ఉన్నారని విమర్శించారు. ఈ రోజు తెలంగాణ సమాజాన్ని కేసీఆర్ అవమానిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇంతకంటే కీలకమైన అంశం ఈ తెలంగాణ ఏమైనా ఉందా అని రేవంత్ ప్రశ్నించారు. తెలంగాణ హక్కుల మీద, నీళ్ల మీద ఒకే మాట మీద నిలబడ్డామని ఆంధ్రప్రదేశ్ నుంచి కేంద్ర ప్రభుత్వం వరకు ఒక సందేశాన్ని పంపాల్సిన సమయంగా పేర్కొన్నారు. కేసీఆర్ కుర్చీలో పద్మారావు కూర్చుకున్నారని..ఆయనకు ఆ బాధ్యత ఇస్తే వారైనా నెరవేరుస్తారని వ్యాఖ్యానించారు. ప్రాజెక్టుల నిర్వహణ బాధ్యతను కేఆర్ఎంబీకి అప్పగించే ప్రసక్తే లేదని సీఎం రేవంత్ తేల్చి చెప్పారు.

 

తీర్మానం – క్రెడిట్:చర్చ సమయంలో మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యల పైన హీరీష్ ఆగ్రహం వ్యక్తం చేసారు. కేసీఆర్ పైన వ్యాఖ్యలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. నల్లగొండలో బీఆర్‌ఎస్‌ సభ పెట్టడంతోనే.. కేఆర్‌ఎంబీకి ప్రాజెక్టులను అప్పజెప్పడంపై కాంగ్రెస్‌ ప్రభుత్వం వెనక్కి తగ్గిందన్నారు. అసెంబ్లీలో ప్రభుత్వం తీసుకొచ్చిన తీర్మానానికి మద్దతు ఇస్తామని చెబుతూనే హరీష్ కొన్ని సవరణలు సూచించారు. తాము నల్గొండలో సభ నిర్వహణకు నిర్ణయించటంతోనే ప్రభుత్వం ఈ తీర్మానం చేయటం..తమ విజయంగా హరీష్ పేర్కొన్నారు. అటు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం స్పందించారు. బీఆర్‌ఎస్‌ ఒత్తిడితోనే కేఆర్‌ఎంబీకి ప్రాజెక్టులను అప్పగించట్లేదని అసెంబ్లీలో కాంగ్రెస్‌ ప్రభుత్వం తీర్మానం ప్రవేశపెట్టిందని చెప్పుకొచ్చారు.