TELANGANA

తెలంగాణలో భారీగా ఐపీఎస్‌ బదిలీలు..

లోక్‌సభ ఎన్నికల గడువు సమీపించింది. ఇంకో నెల రోజుల్లో షెడ్యూల్ వెలువడే అవకాశం ఉంది. తెలంగాణలో ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఈ ఎన్నికలను ఎదుర్కొనడానికి ముమ్మర కసరత్తు సాగిస్తోన్నాయి. గెలుపు గుర్రాల వేటలో పడ్డాయి.

 

తెలంగాణలో మొత్తం 17 లోక్‌సభ స్థానాలు ఉండగా.. అత్యధికం బీఆర్ఎస్ ఖాతాలో ఉన్నాయి. తొమ్మిది స్థానాల్లో గులాబీ జెండా ఎగురుతోంది. నాలుగు చోట్ల బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారు.మరో మూడింటిని కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. ఏఐఎంఐఎం ఒక స్థానాన్ని నిలబెట్టుకుంది.

 

 

లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తోన్న నేపథ్యంలో- తెలంగాణ ఎక్సైజ్ శాఖలో భారీగా బదిలీలు చోటు చేసుకున్నాయి. సుదీర్ఘకాలంగా ఒకేచోట పని చేస్తూ వచ్చిన సూపరింటెండెంట్ స్థాయి అధికారులకు ప్రభుత్వం స్థానచలనం కలిగించింది. వారిని వేర్వేరు స్థానాలకు బదిలీ చేసింది. మొత్తంగా 14 మంది అధికారులు బదిలీ అయ్యారు.

 

ఆ కొన్ని గంటల్లోనే భారీగా ఐపీఎస్ అధికారులనూ బదిలీ చేసింది సర్కార్. మొత్తం 12 మంది ఐపీఎస్‌లకు స్థానచలనం కల్పించింది. రాచకొండ పోలీస్ కమిషనర్ జీ సుధీర్ బాబు బదిలీ అయ్యారు. మల్టీ జోన్-1 ఐజీపీగా నియమించారు. అక్కడున్న తరుణ్ జోషిని రాచకొండ పోలీస్ కమిషనర్‌గా అపాయింట్ చేశారు.

 

ప్రస్తుతం వెయిటింగ్‌లో ఉన్న ఎం శ్రీనివాసులు.. రామగుండం పోలీస్ కమిషనర్‌గా పోస్టింగ్ ఇచ్చారు. గతంలో ఈ స్థానానికి జోగుళాంబ గద్వాల జిల్లా జోన్ 2 డీఐజీ ఎల్ ఎస్ చౌహాన్‌ను నియమించారు. ఆ జీవోను రద్దు చేసింది ప్రభుత్వం. చౌహాన్‌ను ఇప్పుడున్న స్థానంలో కొనసాగించారు.

 

ప్రస్తుతం వెయిటింగ్‌లో ఉన్న డీ జోయెల్ డేవిస్‌.. సైబరాబాద్ జాయింట్ పోలీస్ కమిషనర్ (ట్రాఫిక్)గా పోస్టింగ్ ఇచ్చారు. అక్కడున్న నారాయణ్ నాయక్‌ను సీఐడీ ఎస్‌సీఆర్‌బీ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌గా బదిలీ చేశారు. సీఐడీ మహిళా ప్రొటెక్షన్ సెల్ ఎస్పీగా ఉన్న కే అపూర్వ రావు బదలీ అయ్యారు. టీఎస్ఆర్టీసీ విజిలెన్స్ విభాగం ఎస్పీగా అపాయింట్ అయ్యారు.

 

ఎస్ఓటీ మల్కాజ్‌గిరి డీసీపీ ఆర్ గిరిధర్‌.. ఈస్ట్ జోన్ డీసీపీగా బదిలీ అయ్యారు. ప్రస్తుతం వెయిటింగ్‌లో ఉన్న డీ మురళీధర్.. పోలీస్ అకాడమీ డిప్యూటీ డైరెక్టర్‌గా బదిలీ అయ్యారు. అక్కడున్న డాక్టర్ బీ నవీన్ కుమార్‌కు పోస్టింగ్ ఇవ్వలేదు. డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశించారు.

 

రాజేంద్రనగర్ అదనపు డీసీపీగా ఉన్న సాధన రష్మి పెరుమాళ్.. టాస్క్ ఫోర్స్ డీసీపీగా బదిలీ అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి కొద్దిసేపటి కిందటే ఉత్తర్వులు జారీ చేశారు.