TELANGANA

బీఆర్ఎస్‌తో పొత్తా..?: చెప్పులు చూపించమన్న బండి సంజయ్..

రానున్న లోక్‌సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ 370 సీట్లు సాధిస్తుందని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ (Bandi Sanjay) ధీమా వ్యక్తం చేశారు. తాండూరులో నిర్వహించిన బీజేపీ విజయ సంకల్ప యాత్రలో ఆయన పాల్గొని ప్రసంగించారు. తెలంగాణలో అన్ని పార్లమెంటు స్థానాల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలన్నారు.

 

జమ్మూకశ్మీర్లో 370 ఆర్టికల్‌(Article 370) రద్దు చేసినందుకు 370 సీట్లు కమలం ఖాతాలో వేయాలని కోరారు. బీజేపీ వెనుక రాముడు, మోడీ ఉన్నారన్న బండి సంజయ్.. కాంగ్రెస్‌ వెనుక రాక్షసుడు, రాహుల్‌గాంధీ ఉన్నారని విమర్శించారు. బీఆర్ఎస్‌తో బీజేపీ పొత్తు అని కొందరు ఉద్దేశపూర్వకంగా ప్రచారం చేస్తూ.. మీడియాను తప్పుదోవ పట్టిస్తున్నారని సంజయ్‌ మండిపడ్డారు. తప్పుడు ప్రచారం చేస్తే చెప్పుతో కొడతామంటూ హెచ్చరించారు. అక్కడికి హాజరైన ప్రజలను చెప్పులు చూపించాలనడంతో వారు అలానే చేశారు.

 

గులాబీ పార్టీతో ఎప్పటికీ కమలం పొత్తు పెట్టుకోదని బండి సంజయ్ తేల్చి చెప్పారు. భారత దేశంలో విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకోవటం వంటివి మోడీ సర్కార్కే సాధ్యమన్నారు. బీజేపీ ప్రభుత్వంలో జమ్మూకాశ్మీర్370 ఆర్టికల్ రద్దు చేసినందుకు దేశంలో 370 సీట్లు కమలం ఖాతాలో వేయాలి. తెలంగాణలో రామరాజ్యం ఏర్పడాలంటే 17 స్థానాల్లోనూ బీజేపీని ప్రజలంతా ఆశీర్వదించాలన్నారు బండి సంజయ్.

 

మరోవైపు, నారాయణపేట జిల్లా కృష్ణాలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్రెడ్డి విజయసంకల్ప యాత్రను శంఖారావం పూరించి ప్రారంభించారు. అలాగే మరో చోట అసోం సీఎం హిమంత బిశ్వశర్మ యాత్రను జెండా ఊపి ప్రారంభించారు. ఈ విజయసంకల్ప యాత్ర 114 అసెంబ్లీ సెగ్మెంట్లలో 5,500 కిలోమీటర్ల మేర జరగనుంది. మార్చి 2వ తేదీతో ఈయాత్ర ముగియనుంది. మక్తల్ రోడ్ షోలో పాల్గొన్న కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, ప్రజలు మూడోసారి మోడీ ప్రధాని కావాలని కోరుకుంటున్నారని పేర్కొన్నారు.

 

తొమ్మిదన్నరేళ్లుగా కేంద్రంలో ప్రధాని మోడీ ప్రజలకు అవినీతి రహితపాలన అందిస్తున్నారన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్వల్ల ఇళ్ల నిర్మాణం సరిగా జరగలేదన్నారు. పేదల కోసం మోడీ అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ హయాంలో ఉగ్రవాదుల చొరబాట్లు, బాంబు పేలుళ్లు జరిగాయి తప్ప అభివృద్ధి శూన్యమని కిషన్ రెడ్డి విమర్శించారు. గులాబీ పార్టీ మునిగిపోయ నావ అని, ఆ పార్టీతో ఏ రోజూ బీజేపీ పొత్తు పెట్టుకోలేదన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్రెండూ కుటుంబ పార్టీలేనని దుయ్యబట్టారు.