తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం ‘రైతు నేస్తం’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా 110 రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్ద్వారా ముఖ్యమంత్రి ప్రారంభోత్సవం చేశారు. ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడారు.
రైతులను అన్ని రకాలుగా ఆదుకుంటామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హామీ ఇచ్చారు. రైతులు సాంకేతికత అందిపుచ్చుకునేలా ప్రోత్సహిస్తామని తెలిపారు. రైతులకు మేలు చేసేలా తమ ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పుకొచ్చారు. కాగా, డిజిటల్ ఫ్లాట్ ఫాం ద్వారా రియల్ టైంలో రైతు సమస్యలను పరిష్కరించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ ‘రైతునేస్తం’ కార్యక్రమాన్ని తీసుకొచ్చింది.
ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక క్లస్టర్ చొప్పున ఎంపిక చేసిన ప్రభుత్వం.. త్వరలో దశలవారీగా మొత్తం 2601 క్లస్టర్ల పరిధిలో ఉన్న రైతు వేదికలకు వీడియో కాన్ఫరెన్సింగ్ సదుపాయం కల్పించనుంది. ఇందుకోసం రూ. 100 కోట్ల వరకు ప్రభుత్వం ఖర్చు చేయనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.
ఈ కార్యక్రమం ద్వారా రైతులకు వ్యవసాయ విస్తరణ సేవలతోపాటు శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానం అందించనున్నారు. దీంతో రైతులు పంటల రక్షణతోపాటు ఎక్కువ దిగుబడిని సాధించే అవకాశాలున్నాయి.