లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల గడువు సమీపించింది. మార్చి రెండో వారంలో షెడ్యూల్ వెలువడటం ఖాయంగా కనిపిస్తోంది. తెలంగాణలో ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఈ ఎన్నికలను ఎదుర్కొనడానికి ముమ్మర కసరత్తు సాగిస్తోన్నాయి. గెలుపు గుర్రాల వేటలో పడ్డాయి.
తెలంగాణలో మొత్తం 17 లోక్‌సభ స్థానాలు ఉండగా.. అత్యధికం బీఆర్ఎస్ ఖాతాలో ఉన్నాయి. తొమ్మిది స్థానాల్లో గులాబీ జెండా ఎగురుతోంది. నాలుగు చోట్ల బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారు. మరో మూడింటిని కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. ఏఐఎంఐఎం ఒక స్థానాన్ని నిలబెట్టుకుంది.
ఈ సంఖ్యను భారీగా పెంచుకునే ప్రయత్నాల్లో ఉంది కాంగ్రెస్ పార్టీ. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన ఘన విజయాన్ని లోక్‌సభ పోలింగ్‌లోనూ కొనసాగించాలని భావిస్తోంది. లోక్‌సభ ఎన్నికలను తమ ప్రభుత్వానికి రెఫరెండంగా తీసుకుంటామని కూడా రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే.
ఈ పరిస్థితుల మధ్య- ఈ నెల 12వ తేదీన తెలంగాణ మంత్రివర్గం సమావేశం కాబోతోంది. మధ్యాహ్నం 12 గంటలకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయం ఆరో అంతస్తులో ఈ భేటీ ఏర్పాటు కానుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సర్కులర్ జారీ చేశారు.
ఈ నెల 13 లేదా 14 తేదీల్లో సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ వెలువడుతుందంటూ వార్తలు వెలువడుతున్న విషయం తెలిసిందే. షెడ్యూల్ విడుదలైన వెంటనే ఎన్నికల ప్రవర్తన నియమావళి సైతం అమలులోకి వస్తుంది. ఈ నేపథ్యంలో- దానికి ఒక్క రోజు ముందు మంత్రివర్గ సమావేశానికి రేవంత్ రెడ్డి పిలుపునివ్వడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలను తీసుకునే అవకాశం ఉంది. రైతు బంధు పేరును రైతు భరోసాగా మార్చడం, మహిళలకు వడ్డీ లేని రుణాలు, రైతు రుణ మాఫీ, అందరికీ ఇందిరమ్మ ఇళ్లు, దళితబంధు.. వంటి జనాకర్షక పథకాలపై మంత్రివర్గం కొన్నికీలక నిర్ణయాలను తీసుకునే అవకాశం ఉంది.