TELANGANA

టీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులకు పీఆర్సీ – అమలు ముహూర్తం ఖరారు..!!

రేవంత్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. 21 శాతం ఫిట్ మెంట్ తో ఆర్టీసీ ఉద్యోగులకు పీఆర్సీ ప్రకటించింది. ఈ నిర్ణయంతో 53071 మంది ఉద్యోగులకు మేలు జరగనుంది. ఈ నిర్ణయం ద్వారా ప్రభుత్వం పైన ఏటా రూ 418.11 కోట్ల మేర భారం పడనుంది. ఈ నిర్ణయం జూన్ 1వ తేదీ నుంచి అమల్లోకి రానుందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. ఈ నిర్ణయం పైన ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

 

తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. 2017లో కేసీఆర్ ప్రభుత్వం నాడు 16 శాతం పీఆర్సీ ఇచ్చింది. అప్పటి నుంచి పీఆర్సీ ప్రకటించలేదు. ఆర్దికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ ఉద్యోగులకు పీఆర్సీ ఇవ్వాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. అందులో భాగంగానే ఉద్యోగులకు 21 శాతం పీఆర్సీ ఇవ్వాలని డిసైడ్ అయినట్లు వివరించారు. ఇప్పుడు తీసుకున్న నిర్ణయం మేరకు టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు కొత్త పీఆర్సీ జూన్ నుంచి అమల్లోకి వస్తుందని మంత్రి పొన్నం ప్రకటించారు.

 

ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత 48 గంటల్లోనే మహాలక్ష్మి పథకాన్ని అమలు చేసినట్లు గుర్తు చేసారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా మహాలక్ష్మి స్కీమ్ విజయవంతంగా నడుస్తుందని మంత్రి పొన్నం వివరించారు. మరో నాలుగు రోజుల్లో సార్వత్రిక ఎన్నికలకు షెడ్యూల్ విడుదల కానుంది. ఈ ఎన్నికలను రేవంత్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. మెజార్టీ సీట్లలో గెలుపే లక్ష్యంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా ఇప్పుడు ఆర్టీసీ ఉద్యోగులకు పీఆర్సీ పైన నిర్ణయం తీసుకున్నారు.