భారత రాష్ట్ర సమితి(BRS) వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తే అభ్యర్థులను ఖరారు చేసే పనిలో నిమగ్నమైంది. బీఆర్ఎస్ తరపున చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గ అభ్యర్థిగా కాసాని జ్ఞానేశ్వర్(Kasani Gyaneshwar) పేరు ఖరారైనట్లు సమాచారం. చేవెళ్ల పార్లమెంట్ పరిధిలోని బీఆర్ఎస్నేతలతో ఆ పార్టీ అధినేత కేసీఆర్(KCR) నందినగర్‌లోని తన నివాసంలో సమావేశమయ్యారు.
మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, నియోజకవర్గ పరిధిలోని ఎమ్మెల్యేలు, మాజీలు, నేతలు సమావేశంలో పాల్గొన్నారు. లోక్‌సభ ఎన్నికల కార్యాచరణ, అభ్యర్థిత్వంపై సమావేశంలో చర్చ జరిగింది. సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి (Ranjit Reddy) ఎన్నికల పోటీ నుంచి తప్పుకోవడంతో ప్రత్యామ్నాయంగా పోటీ చేసే అభ్యర్థి విషయమై సమావేశంలో చర్చించారు.
కొన్ని వ్యక్తిగత, ఇతర కారణాల రీత్యా రంజిత్ రెడ్డి ఎన్నికల్లో పోటీ చేయడం లేదని, ఆయన ఎక్కడకీ పోరని, పార్టీలోనే కొనసాగుతారని కేసీఆర్ నేతలకు చెప్పినట్లు తెలిసింది. శాసనసభ ఎన్నికల ఫలితాల పరంగా చూస్తే పార్టీకి మెజార్టీ ఉందని, లోక్‌సభ ఎన్నికల్లోనూ పార్టీ విజయం సాధిస్తుందని నేతలతో కేసీఆర్ ధీమా వ్యక్తం చేసినట్లు సమాచారం.
అయితే, కొంత మంది నేతలు పార్టీ మారవచ్చని, ఆ ప్రభావం పార్టీపై ఉండబోదని కేసీఆర్ అన్నట్లు తెలిసింది. చేవెళ్ల ఎంపీ స్థానం నుంచి కాసాని జ్ఞానేశ్వర్ అభ్యర్థిత్వానికి నేతలు మొగ్గు చూపినట్లు సమాచారం. ఈ సమావేశంలో ఈ సమావేశానికి మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తోపాటు ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, ప్రకాశ్ గౌడ్, ఎమ్మెల్సీ మధుసూదనాచారి, మాజీ ఎమ్మెల్యేలు పైలట్ రోహిత్ రెడ్డి, మెతుకు ఆనంద్, మహేశ్వర్ రెడ్డి, సీనియర్ నాయకులు కాసాని జ్ఞానేశ్వర్, సబితా ఇంద్రారెడ్డి కుమారుడు కార్తీక్ రెడ్డితో పాటు పలువురు హాజరయ్యారు.
కాగా, ఇప్పటికే పలువురు అభ్యర్థులను కేసీఆర్ ఖరారు చేసిన విషయం తెలిసిందే. కరీంనగర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి బి వినోద్ కుమార్, పెద్దపల్లి నుంచి కొప్పుల ఈశ్వర్, ఖమ్మం నుంచి నామ నాగేశ్వర్ రావు, మహబూబాబాద్ నుంచి మాలోత్ కవిత బరిలో దిగనున్నారు.