సార్వత్రిక ఎన్నికల ముందు తెలంగాణలో భారతీయ జనతా పార్టీ సరికొత్త ప్రచారాస్త్రాన్ని సిద్దం చేసింది. బీజేపీ సీనియర్ నేత లక్ష్మణ్‌తో కలిసి నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో ప్రశ్నిస్తున్న తెలంగాణ పేరుతో వెబ్‌సైట్ పోస్టర్‌ను ఆవిష్కరించారు తెలంగాణ పార్టీ అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. ఇచ్చిన గ్యారంటీల అమలు జరిగే వరకు కాంగ్రెస్‌ను వెంటాడుతామని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీలకు అమలు చేసే పత్తా లేకుండా పోయిందని కిషన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీ ఆధ్వర్యంలో నేటి నుంచే ప్రశ్నించే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామన్నారు. బీఆర్ఎస్ కుటుంబ పాలనలో తెలంగాణ తల్లి బంధీ అయిందని, ఉద్యమాలతో మొదలైన బీఆర్ఎస్ ప్రజాస్వామ్యాన్ని మంట గలిపిందని కిషన్ రెడ్డి మండిపడ్డారు. ఆ తర్వాత వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను మరిచిందని ధ్వజమెత్తారు.
అందుకే భారతీయ జనతా పార్టీ నేటి నుంచే ప్రశ్నించే కార్యక్రమాన్ని ప్రారంభిస్తుందన్నారు కిషన్ రెడ్డి. మహిళలకు స్కూటీలు ఇస్తామన్నారని, దివ్యాంగులకు రూ.6 వేలు పెన్షన్ ఇస్తామన్నారని ఆయన గుర్తు చేశారు. వాటిని ఇంకెప్పుడు అమలు చేస్తారని ప్రశ్నించారు. కొత్త రేషన్ కార్డులు ఇస్తామన్నారు, ఇస్తారా ఇవ్వరా? చెప్పాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కిషన్ రెడ్డి నిలదీశారు.
రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తా అన్నారు చేస్తారో? చెయ్యరో చెప్పాలి. వ్యవసాయ కూలీలకు రూ.12 వేలు ఇస్తామన్నారు. ఇల్లు లేనివారికి ఇల్లు ఇస్తాం. రూ.5 లక్షలు ప్రభుత్వం ఇస్తుంది అన్నారు. ఎప్పుడిస్తారు? నిరుద్యోగ యువత తెలంగాణ కోసం పోరాటం చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం రూ.4 వేలు భృతి ఇస్తామన్నారు. ఏమైంది? వీటంన్నింటినీ ప్రశ్నిస్తున్న తెలంగాణ, డిజిటల్ క్యాంపెయిన్ కార్యక్రమం ద్వారా ప్రజల ముందుకు తీసుకెళ్తామని కిషన్ రెడ్డి వివరించారు.
కాంగ్రెస్ పాపాలపై పెద్ద ఎత్తున డిజిటల్ క్యాంపెయిన్ నిర్వహించి, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని వెంటాడుతామన్నారు కిషన్ రెడ్డి. ఇచ్చిన హామీలు నెరవేర్చేలా కాంగ్రెస్‌పై ఒత్తిడి తెస్తామన్నారు. తెలంగాణ సమాజానికి బీజేపీ అండగా నిలుస్తుందని, వారిని చైతన్యవంతం చేస్తామని తెలిపారు. రాబోయే 6 సంవత్సరాల్లో కాంగ్రెస్ ఉంటే పోటీ చేస్తుంది.. లేదంటే కాంగ్రెస్సే ఉండదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి జోస్యం చెప్పారు. నరేంద్ర మోడీ మూడోసారి ప్రధాని కావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.