లోక్సభ ఎన్నికల ముందు కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ పార్టీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల తర్వాత నుంచి బీఆర్ఎస్ పార్టీ ఎంపీ, ఎమ్మెల్యేలు, నేతలు ఒక్కొక్కరుగా ఆ పార్టీని వీడుతున్నారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్, బీజేపీలోకి వలసలు కొనసాగుతున్నాయి. తాజాగా, మరో బీఆర్ఎస్ కీలక నేత, కేసీఆర్ సన్నిహితుడు కే కేశవరావు పార్టీని వీడేందుకు సిద్ధమైనట్లు సమాచారం.
శుక్రవారం బీఆర్ఎస్సీనియర్నేత కే కేశవరావుతో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ దీపాదాస్మున్షీ భేటీ అయ్యారు. బంజారాహిల్స్‌లోని కేకే నివాసానికి దీపాదాస్ మున్షీ పాటు ముఖ్యమంత్రి సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డి వెళ్లారు. దాదాపు 40 నిమిషాల పాటు తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు. ఈ సమావేశంలో హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మీ కూడా ఉన్నారు. వీరిని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించినట్లు సమాచారం.
లోక్‌సభ ఎన్నికల అభ్యర్థుల ఎంపికపై తీవ్ర కసరత్తు సాగుతున్న సమయంలో కేకేను కాంగ్రెస్ నేతలు కలవడం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే, గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలను చూస్తే.. బీఆర్‌ఎస్ నాయకుల కాంగ్రెస్ చేరికలు ముమ్మరమయ్యాయని చెప్పొచ్చు. చేవెళ్ల సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి, వికారాబాద్ జిల్లా పరిషత్ ఛైర్మన్ సునీతా మహేందర్ రెడ్డి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీలో చేరి, లోక్‌సభ టికెట్లు కూడా దక్కించుకున్నారు.
ఈ నేపథ్యంలోనే కేకే, విజయలక్ష్మి కాంగ్రెస్ నేతలతో కలిసి చర్చించడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. వీరిద్దరూ పార్టీ మారే అవకాశాలు ఉన్నట్లు ఊహాగానాలు తెరపైకి వస్తున్నాయి. గతంలో పీసీసీ అధ్యక్షుడిగా కొనసాగిన కేశవరావు, ఇప్పుడు తిరిగి సొంత గూటికి చేరే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. అయితే తాను పార్టీ మారడం లేదని కేకే చెప్పడం గమనార్హం. అయితే, త్వరలోనే దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మరోవైపు, కార్యకర్తలతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని మేయర్ విజయలక్ష్మి చెప్పారు.
కాగా, అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్తరఫున పోటీ చేసి ఓటమి పాలైన మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులు సహా లోక్సభ ఎన్నికల్లో సీటు ఆశించి భంగపడ్డ నేతలంతా ప్రస్తుతం కాంగ్రెస్, బీజేపీల వైపు చూస్తున్నారు. ఇప్పటికే శానంపూడి సైదిరెడ్డి, ఆరూరి రమేశ్వంటి నేతలు బీఆర్ఎస్‌ను వీడి బీజేపీ గూటికి చేరిపోయారు. మరికొంత మంది కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునేందుకు రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్నేతలు సైతం ఇతర పార్టీల్లోని ముఖ్య నేతలను తమ పార్టీలోకి ఆహ్వానిస్తుండటం గమనార్హం.