తెలంగాణ రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. గులాబీ పార్టీకి వరుస దెబ్బలు తగులుతున్నాయి. లోక్ సభ ఎన్నికలకు సిద్దం అవుతున్న వేళ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతున్నారు. తాజాగా ఖమ్మం జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న గులాబీ పార్టీ ఏకైక ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు కాంగ్రెస్ లో చేరారు. కొంత కాలంగా వెంకటరావు కాంగ్రెస్ లో చేరటం పైన ప్రచారం సాగుతోంది. ఆయన ఖండిస్తూ వచ్చారు. ఇప్పుడు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.
భద్రాచలం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఆయన హస్తం గూటికి చేరారు. సీఎం రేవంత్ కాంగ్రెస్ కండువాను కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ కీలక నేత, పాలేరు ఎమ్మెల్యే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి అనుచరుడిగా ఉన్న తెల్లం వెంకట్రావ్ గత రాత్రి (శనివారం) తక్కుగూడలో కాంగ్రెస్ నిర్వహించిన జనజాతర సభలోనే రాహుల్ సమక్షంలోనే పార్టీలో చేరినప్పటికీ నేడు (ఆదివారం) సీఎం రేవంత్‌ను కలిశారు. ఈ సందర్భంగా పార్టీ కండువాను కప్పి సాదరంగా రేవంత్ ఆహ్వానించారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పది నియోజకవర్గాల్లో భద్రాచలం నియోజకవర్గం మినహా తొమ్మిది స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. భద్రాచలం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి తెల్లం వెంకట్రావు విజయం సాధించారు. అయితే, గెలిచిన నాటినుంచి ఆయన కాంగ్రెస్ నేతలతో సఖ్యతగా ఉంటూ వస్తున్నారు. గతంలో పొంగులేటితో కలిసి సీఎం రేవంత్ రెడ్డితోనూ తెల్లం వెంకట్రావు భేటీ అయ్యారు. ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. మరోవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుసైతం కాంగ్రెస్ లో చేరుతున్నారు. ఇప్పటికే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.
తాజాగా మరో ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ పార్టీలో చేరడంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మరికొందరు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారంటూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసారు. పార్లమెంట్ ఎన్నికల సమయంలో వరుసగా తగులుతున్న ఎదురుదెబ్బలతో బీఆర్ఎస్ ఏ రకంగా ముందుకు వెళ్తుందనేది రాజకీయంగా ఆసక్తి కరంగా మారుతోంది.