APTELANGANA

క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు..

తెలుగు సంవత్సరం ప్రారంభంలో మొదటి రోజు మనం ఉగాది జరపుకుంటారు. రాబోయే రోజుల్లో ప్రజలు తప్పనిసరిగా అన్ని రుచులను అనుభవించాలని… జీవితంలోని మంచితనాన్ని పొందాలని ఉగాది పండుగ సూచిస్తుంది. ఉగాది ప్రాముఖ్యతపై బిగ్‌టీవీ నెట్ యూజర్స్‌కు స్పెషల్‌.

 

ఉగాది హిస్టరీలోకి వెళ్తే..!

 

హిందూ పురాణాల ప్రకారం.. బ్రహ్మ దేవుడు ఉగాది రోజున విశ్వ సృష్టిని ప్రారంభించాడని నమ్ముతారు. దుర్గామాత తొమ్మిది రూపాలను జరుపుకునే తొమ్మిది రోజుల పండుగలో మొదటి రోజు – చైత్ర నవరాత్రి. బ్రహ్మ దేవుడు మానవజాతి సృష్టికి నాంది పలికినందుకు గుర్తుగా ఉగాది జరుపుకుంటారు. 12వ శతాబ్దంలో .. భారతీయ గణిత శాస్త్రవేత్త భాస్కరాచార్య ఉగాదిని తెలుగువారికి కొత్త సంవత్సరం, కొత్త నెల, కొత్త రోజుగా గుర్తించారు.

 

ఉగాది విశ్వాన్ని సృష్టించడానికి బ్రహ్మ దేవుడు చేసిన కృషిని సూచిస్తుంది. శీతాకాలంలోని కఠినమైన చలి తర్వాత, వసంతకాలం ప్రారంభం, తేలికపాటి వాతావరణాన్ని సూచించే పండుగ కూడా దీనిని పరిగణిస్తారు. వారం నుంచే ఉగాది వేడుకలకు సన్నాహాలు ప్రారంభమవుతాయి. ప్రజలు తమ ఇళ్లను శుభ్రం చేసి కొత్త దుస్తులు కొనుగోలు చేస్తారు. గృహాలకు అందంగా అలంకరిస్తారు. పండుగ రోజున ప్రజలు తమ ఇంటి ముందు ఆవు పేడతో కలిపిన నీటిని చల్లుతారు. ముగ్గులు వేసి పువ్వులు, రంగులతో అలంకరిస్తారు. స్నానాలు చేసి.. కొత్తబట్టలు ధరించి దేవుళ్లకు పూజలు చేసి.. నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతారు. ఉగాది పచ్చడితో పండుగను ప్రారంభించి.. రకరకాల పిండివంటలు చేసుకుంటారు. బంధువులు, స్నేహితులతో కలిసి ఆనందంగా గడుపుతారు.

 

దేశంలో ఉగాది స్పెషలేంటి..!

 

హిందువులు అత్యంత ఇష్టంగా జరుపుకునే తొలి పండుగ ఉగాది. ఉగాదితోనే తెలుగువారి పండుగలు ప్రారంభమవుతాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, కేరళలలో ఉగాది పండుగను జరుపుకుంటారు. ఒక్కొక్క చోట ఒక్కొక్క పేరుతో ఈ పండుగను జరుపుకోవడం విశేషం.

 

ఉగాది.. చైత్ర శుక్ల పాఢ్యమినాడే ఎందుకంటే వసంత మాసంలోకి వచ్చే ఈ పండుగకు ప్రకృతికి ఎంతో అవినాభావ సంబంధం ఉంటుంది. భారతీయ సాంప్రదాయం ప్రకారం ఉగాది రోజున సృష్టి జరిగిందని పురాణాలలో చెబుతారు. ఈ రోజునే బ్రహ్మ సృష్టిని సృష్టించాడని బలంగా విశ్వసిస్తారు కూడా. ప్రభవ నామ ఉగాదితో బ్రహ్మకల్పం మొదలై నేటికీ కొనసాగుతూనే ఉంది.

 

ఉగాది పచ్చడి స్పెషల్..!

 

ఉగాది అనగానే మెుదట గుర్తుకు వచ్చేది.. ఉగాది పచ్చడి. ఇది లేకుండా పండుగ ఉండదు. దీని వెనక చాలా కారణాలు ఉన్నాయి. ఆరు రుచులను చూడటం వెనక కొన్ని విధానాలు ఉన్నాయి. వాటి గురించి కచ్చితంగా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఉగాది రోజు తీపి, పులుపు, ఉప్పు, కారం, చేదు, వగరును రుచి చూస్తారు. ఇది లేకుండా ఉగాది అనేది ఉండదు. ఈ షడ్రుచులను కుటుంబ సభ్యులంతా పచ్చడి రూపంలో తీసుకుంటారు. ఒక్కో రుచి ఒక్కో అనుభూతిని ఇస్తుంది. జీవితంలోని ప్రతీ విషయం షడ్రుచులతో ముడిపడి ఉంటాయి. ఉగాది హిందూ చాంద్రమాన క్యాలెండర్ ప్రకారం చూసుకుంటే కొత్త సంవత్సరం తొలి రోజు.. తొలి పండుగ కూడా. తెలుగువారికి తెలుగు కొత్త సంవత్సరం ఆరంభం అన్నమాట.

 

వేప చేదు రుచిని చూపిస్తుంది. వేప ఒక ఔషధ గుణాలు ఉన్న చెట్టు. దీనిని తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. జీవితంలో స్వచ్ఛమైన చేదు కూడా ఉంటుంది. దానిని భరించాలి, కష్టం వచ్చినప్పుడు కుంగిపోకూడదు. ప్రతి కష్టాన్ని ఎదుర్కోవాలి. అప్పుడే జీవితం మధురంగా ఉంటుంది. జీవితం బాగుంటుంది అనే భావాన్ని ఈ రుచి సూచిస్తుంది. ఉగాది పచ్చిడిలో బెల్లం కలుపుతారు. జీవితంలో సంతోషంగా ఉండాలని ఇది చెబుతుంది. ఈ బెల్లం అనేది తియ్యని రుచి. కష్టాల తర్వాత ఆనందం వస్తుందని, నొప్పి తగ్గుతుందని, ఆనందం పెరుగుతుందని ఆశను తెలియజేస్తుంది. మనం మార్పును స్వీకరించాలి. చిరునవ్వుతో జీవితాన్ని అంగీకరించాలి అనే భావన కలిగిస్తుంది.

 

కొందరు ఉగాది పచ్చడిలో కారం వేస్తారు.. మరికొందరు బ్లాక్ పెప్పర్ ఉపయోగిస్తారు. ఇది కోపాన్ని సూచిస్తుంది. ప్రతి మనిషిలో కోపం ఉంటుంది. కోపం ఉండాలి అంటారు కానీ.. తక్కువ ఉంటే మంచిది. కోపంతో ఏ పని చేసినా ఇబ్బంది కలుగుతుంది. ఉప్పు లేకుండా వంట చేయడం అనేది కష్టం. ఉప్పు భయాన్ని సూచిస్తుంది. ఏదైనా పని చేసేటప్పుడు కొంత భయం ఉండాలి. చింతపండు అద్భుతమైన జీర్ణశక్తిని కలిగించే ఆహారం. ఇది తెలియజేసే వాస్తవం ఏమిటంటే ఒక వ్యక్తి తన జీవితంలో వచ్చే అన్ని విషయాలను లేదా పరిస్థితులను తగిన విధంగా అంగీకరించడం ద్వారా జీర్ణించుకోవాలి. మామిడి ఆశ్చర్యానికి చిహ్నం. వేప, బెల్లం కలిపితే మామిడి రుచి సూపర్‌గా ఉంటుంది. అలాగే జీవితంలోని కొన్ని ఆశ్చర్యాలు జీవితాన్ని మరింత అందంగా మారుస్తాయి. అందుకే వగరు రుచిని ఉగాది పచ్చడిలో కలుపుతారు.

 

పంచాంగ శ్రవణం విశిష్టత..!

 

సరిగా ఉగాది రోజున దేవాలయం, మరో ప్రదేశంలోనే పంచాంగ పఠనం ప్రారంభమవుతుంది. కొత్త ఏడాదిలో మన జీవితం, మనల్ని పరిపాలించే పాలకుల రాజ్యం, మననందరినీ పరిపాలించే ఆ భగవానుని అభిప్రాయం ఎలా ఉందో ఆ విషయమంతా దీని ద్వారా తెలుసుకోగలుగుతాం. మనం చేసిన పాప పుణ్యాల కనుగుణంగా మనకు రావాల్సిన లాభ నష్టాల్ని గమనించిన భగవంతుడు, లాభాల్ని కల్గించేందుకు శుభగ్రహాలను, నష్ట పెట్టేందుకు అశుభగ్రహాలను నాయకులుగా నియమిస్తూ కొత్త సంవత్సరాన్ని నిర్మిస్తాడు.