TELANGANA

తెలంగాణ బీసీ గురుకులాల్లో ఇంటర్ ప్రవేశాల పరీక్ష ఫలితాలు విడుదల

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని బీసీ గురుకులాల్లో ఇంటర్ ప్రవేశాల కోసం నిర్వహించిన పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. మంత్రి గంగుల కమలాకర్ సోమవారం ఈ ఫలితాలను విడుదల చేశారు.

ఎంపీసీలో సిద్దిపేట జిల్లాకు చెందిన పీ జ్యోత్స్న 122 మార్కులతో తొలి ర్యాంక్ సాధించింది. బైపీసీలో నల్గొండ జిల్లాకు చెందిన పీ శ్రీవల్లి 108 మార్కులతో ఫస్ట్ ర్యాంక్ సాధించింది.

సీఈసీలో పెద్దపల్లి జిల్లాకు చెందిన కే సాయి సంహిత 107 మార్కులతో, ఎంఈసీలో మేడ్చల్ జిల్లాకు చెందిన ఎ అర్చన 109 మార్కులతో తొలి స్థానం దక్కించుకున్నారు.
https://mjptbcwreis.telangana.gov.in
/ వెబ్‌సైట్‌లో ఫలితాలు అందుబాటులో ఉంటాయని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. జూన్ 1 నుంచి 10వ తేదీ వరకు గురుకుల కళాశాలల్లో చేరేందుకుక గడువు విధించినట్లు వెల్లడించారు.

తెలంగాణ ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల

తెలంగాణలో ఇంజినీరింగ్ కాలేజీల్లో ప్రవేశాలకు సంబంధించిన కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ విడుదల చేసింది. ఎంసెట్(TS EAMCET) ఇంజినీరింగ్, అగ్రికల్చర్ ఫలితాలు విడుదలైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో గత శనివారం ప్రవేశాల కౌన్సెలింగ్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను అధికారులు విడుదల చేశారు.

జూన్ 26 నుంచి ఆగస్టు 9 వరకు మూడు విడతల్లో ఇంజినీరింగ్ ప్రవేశాలు ప్రక్రియ జరగనుంది. జూన్ 26 నుంచి మొదటి విడత ఇంజనీరింగ్ ప్రవేశాల ప్రక్రియ ఉంటుంది. జూన్ 26న ఆన్ లైన్‌లో కౌన్సిలింగ్ ఫీజు చెల్లింపు, ధ్రువపత్రాల స్లాట్ బుకింగ్ ఉంటుంది. జూన్ 28 నుంచి జులై 6 వరకు ధ్రువపత్రాల పరిశీలన.. జూన్ 28 నుంచి జులై 8 వరకు వెబ్ ఆప్షన్లు నమోదు ప్రక్రియ ఉంటుంది. జులై 12న మొదటి విడత ఇంజనీరింగ్ సీట్ల కేటాయింపు జరుగుతుంది.

జులై 12 నుంచి 19 వరకు ఆన్‌లైన్‌లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. జులై 21 నుంచి రెండో విడత ఇంజనీరింగ్ ప్రవేశాల కౌన్సెలింగ్ స్టార్ట్ అవుతుంది. జులై 21 నుంచి 24 వరకు రెండో విడత వెబ్ ఆప్షన్ల నమోదు ప్రక్రియ నడుస్తుంది. జులై 28న రెండో విడత ఇంజనీరింగ్ సీట్ల కేటాయింపు జరుగుతుంది.

ఆగస్టు 2 నుంచి తుది విడత ఇంజనీరింగ్ ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఆగస్టు 2 నుంచి 4 వరకు తుది విడత వెబ్ ఆప్షన్ల నమోదు ఉంటుంది. ఆగస్టు 7న ఇంజనీరింగ్ తుది విడత సీట్ల కేటాయింపు చేస్తారు. ఆగస్టు 7 నుంచి 9 వరకు కాలేజీల్లో చేరేందుకు గడువుగా నిర్ణయించారు. ఆగస్టు 8న స్పాట్ అడ్మిషన్ల మార్గదర్శకాలు విడుదల చేయనున్నట్లు విద్యాశాఖ అధికారులు ప్రకటించారు.