హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై హైదరాబాద్ వెస్ట్ జోన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి బుధవారం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి హల్చల్ చేసిన విషయం తెలిసిందే. ప్రతిపక్ష నాయకుల ఫోన్లను ట్యాపింగ్ చేస్తున్నారంటూ.. ఫిర్యాదు చేసేందుకు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. ఈ సందర్భంగా అక్కడ విధుల్లో గల సీఐకు కౌశిక్ రెడ్డికి మధ్య వాగ్వివాదం సాగింది. తాను ప్రస్తుతం ఇతర విధుల్లో ఉన్నానని, తర్వాత వచ్చి ఫిర్యాదు తీసుకుంటానని సీఐ జవాబిచ్చారు. దీనితో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సీరియస్ అయ్యారు. సీఐ వాహనానికి వారు అడ్డు తగలడంతో, పోలీస్ జీప్ దిగి వచ్చి సీఐ ఫిర్యాదు అందుకున్నారు.
ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పై నమోదైన కేసు వివరాల మేరకు.. విధినిర్వహణలో వెళుతున్న పోలీస్ ఇన్స్పెక్టర్ కారుకు అడ్డుపడి, విధులకు ఆటంకం కలిగించడంతో సంబంధిత సీఐ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు వెస్ట్ జోన్ డీసీపీ తెలిపారు. సాధారణంగా పోలీస్ స్టేషన్ కు వచ్చే ఫిర్యాదుదారులు తమ ఫిర్యాదును పోలీస్ స్టేషన్ లోని రిసెప్షన్ లో సమర్పించి రసీదును పొందవచ్చని, అందుకు బదులుగా విధి నిర్వహణలో ఉన్న అధికారిని అడ్డుకోవడం చట్టబద్ధం కాదని డీసీపీ తెలిపారు.
అలాగే ఎమ్మెల్యేతో పాటు వచ్చిన అనుచరులు సైతం ఎటువంటి కారణం లేకుండా, సీఐని దుర్భాషలాడడం, బెదిరింపులకు దిగినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎమర్జెన్సీ విధుల్లో ఉన్న తనను అడ్డుకొని విధులకు ఆటంకం కలిగించిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని వెస్ట్ జోన్ పోలీసులకు ఫిర్యాదు అందింది. దీనితో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు.
కాగా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో హల్చల్ చేసిన కౌశిక్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో భూకంపం వచ్చేందుకు సీఎం రేవంత్ రెడ్డే కారణమంటూ విమర్శించారు. అలాగే బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద జరిగిన ఘటన గురించి ట్వీట్ సైతం చేశారు. ప్రతిపక్ష నాయకుల ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారంటూ రేవంత్ రెడ్డి, ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేయడానికి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కు వెళ్తే బంజారాహిల్స్ సీఐ పారిపోయినట్లు ట్వీట్ చేశారు. అలాగే అధికార పార్టీకి కొమ్ము కాస్తూ, వాళ్ళు చెప్పింది చేస్తూ తలాడించే ప్రభుత్వ అధికారులను వదిలేది లేదని హెచ్చరించారు. ఈ తరుణంలో ఎమ్మెల్యేపై కేసు నమోదు కాగా, రిప్లై ఎలా ఉంటుందో వేచి చూడాలి.