హయ్యర్ సెకండరీ స్కూల్ సర్టిఫికెట్ విధానం అమల్లో ఉన్న కాలంలో మార్కుల లిస్టుతో పాటే క్రీడారంగం (ఫిజికల్ ఎడ్యుకేషన్) లోనూ విద్యార్థుల వివరాలు ఉండేవని, మళ్లీ ఈ విధానాన్ని ప్రవేశపెట్టాలని ప్రాథమిక స్థాయిలో ఆలోచిస్తున్నట్లు మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ తండ్రి సుభాష్ చంద్రబోస్ 1964లో హెచ్ఎస్‌సీ పూర్తిచేసినప్పుడు పాఠశాల జారీచేసిన మార్కుల సర్టిఫికెట్‌లో రన్నింగ్ రేస్, హై జంప్, లాంగ్ జంప్, బాల్ త్రోయింగ్ తదితర క్రీడల్లో చూపిన ప్రతిభను కూడా పేర్కొన్నారని మంత్రి గుర్తు చేశారు.
ఇలాంటి విధానంతో విద్యార్థుల్లో క్రీడల పట్ల ఆసక్తి పెరుగుతుందని, దాన్ని ఒక విధానంగా ఇకపైన పాటించడంపై ప్రభుత్వంతో చర్చిస్తానని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడా రంగానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నదని, స్పోర్ట్స్ విశ్వవిద్యాలయాన్ని కూడా నెలకొల్పిందని, ఒలింపిక్ క్రీడల్లో తెలంగాణ యువత మెడల్స్ సాధించేలా తీర్చిదిద్దడంపై ఫోకస్ పెట్టిందని గుర్తుచేశారు. హెచ్ఎస్‌సీ కాలంలో మార్కుల లిస్టుతో పాటే క్రీడల్లో, ఎక్స్ ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్‌లో చూపిన ప్రతిభను గుర్తించి ప్రోత్సహించాలని భావిస్తున్నట్లు తెలిపారు.