TELANGANA

కేసీఆర్‌తో కేటీఆర్ భేటీ.. ఏసీబీ విచారణకు సంబంధించిన విషయాలపై ఆరా..

బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ను ఆయన తనయుడు, మాజీ మంత్రి కేటీఆర్ శుక్రవారం ఎర్రవల్లి ఫాంహౌజ్‌లో భేటీ అయ్యారు. ఫార్ములా ఈ కార్ రేసులో గురువారం కేటీఆర్‌ను ఏడు గంటలపాటు విచారించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఏసీబీ విచారణకు సంబంధించిన విషయాలను కేసీఆర్‌కు కేటీఆర్ వివరించారు.

 

ఏసీబీ అధికారులు అడిగిన ప్రశ్నలు పదే పదే అడిగారని, విచారణకు పూర్తిగా సహకరించానని కేటీఆర్.. కేసీఆర్‌కు వివరించారు. ఈ భేటీలో మాజీ మంత్రి హరీశ్ రావతోపాటు బీఆర్ఎస్ నేతలు బాల్క సుమన్, పాడి కౌశిక్ రెడ్డి కూడా ఉన్నారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలపైనా చర్చించినట్లు తెలిసింది. మరోవైపు, ఫార్ములా ఈ కార్ రేసు వ్యవహారంలో ఈడీ కూడా కేటీఆర్‌కు నోటీసులు ఇచ్చింది. జనవరి 16న విచారణకు హాజరుకావాలని సూచించింది.

 

కేటీఆర్‌పై మరో కేసు నమోదు

 

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌పై హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. గురువారం ఏసీబీ విచారణ అనంతరం బంజారాహిల్స్‌లోని బీఆర్ఎస్ కార్యాలయం వరకు అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించారని ట్రాఫిక్ పోలీసులు ఫిర్యాదు చేశారు.

 

ట్రాఫిక్ పోలీసుల ఫిర్యాదు మేరకు కేటీఆర్ తోపాటు గెల్లు శ్రీనివాస్, బాల్క సుమన్, మున్నె గోవర్ధన్, క్రిశాంక్, జైసింహ, తదితరులపై 305, r/w 62 బీఎన్ఎస్ సెక్షన్ల కింద కేసు నమోదైంది. కాగా, ఫార్ములా ఈ రేస్ కేసులో గురువారం కేటీఆర్‌ను ఏసీబీ అధికారులు దాదాపు 7 గంటలపాటు విచారించారు. విచారణ అనంతరం ఏసీబీ ఆఫీసు నుంచి బంజారాహిల్స్‌లోని బీఆర్ఎస్ ఆఫీస్ వరకు కేటీఆర్ ర్యాలీగా వెళ్లారు.

 

అయితే, అనుమతి లేకుండా ర్యాలీ తీసి వాహనదారులకు ఇబ్బంది కలిగించడమే కాకుండా ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించినందుకు కేటీఆర్‌పై ట్రాఫిక్ పోలీసులు ఫిర్యాదు చేశారు. మరోవైపు, గురువారం విచారణ అనంతరం బయటకు వచ్చిన కేటీఆర్ ఏసీబీ ఆఫీస్ దగ్గర మీడియాతో మాట్లాడుతుండగా డీసీపీ అడ్డుకున్నారు.

 

ఇక్కడ మాట్లాడొద్దని.. పార్టీ ఆఫీసుకు వెళ్లి ప్రెస్‌మీట్ పెట్టి మాట్లాడుకోవాలని కేటీఆర్‌కు ఆయన సూచించారు. దీంతో మీడియాతో మాట్లాడితే మీకెందుకు భయపమంటూ డీసీపీపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తర్వాత అక్కడ్నుంచి తెలంగాణ భవన్‌కు వెళ్లిపోయారు.