TELANGANA

అధికారులను ప్యాలెస్ కు పిలిపించుకుని అహం ప్రదర్శిస్తున్నావు.. రేవంత్ రెడ్డిపై హరీశ్ రావు ఫైర్..

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్యే హరీశ్ రావు మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రజాపాలన అన్నావని, సీఎం క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ అన్నావని, ప్రజలను ప్రతిరోజు కలుస్తా అన్నావని… కానీ ఏడాది కాలంగా ప్రజలకు ముఖం చాటేశావని హరీశ్ మండిపడ్డారు. జూబ్లీహిల్స్ లోని ప్యాలెస్ నుంచి లేదంటే కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పాలన కొనసాగిస్తున్నావని దుయ్యబట్టారు.

 

ముఖ్యమంత్రి, మంత్రులు, అన్ని శాఖలు, విభాగాలు ఒకే చోట ఉండే సువిశాలమైన సచివాలయం నుంచి కాదని… జూబ్లీహిల్స్ లోని నీ ప్యాలెస్ కు, కమాండ్ కంట్రోల్ సెంటర్ కు మంత్రులు, అధికారులను పరుగులు పెట్టిస్తున్నావని విమర్శించారు. సీఎం అధికార నివాసం నీ దర్పానికి సరిపోదని… జూబ్లీహిల్స్ ప్యాలెస్ లోనే ఉంటున్నావని అన్నారు. మంత్రులు, అధికారులను నీ ప్యాలెస్ కు పిలిపించుకుని అహం ప్రదర్శిస్తున్నావని చెప్పారు. పోలీసుల పహారా మధ్య గ్రామ సభలు నిర్వహిస్తున్నారని… పోలీసు కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ప్రభుత్వ నిర్ణయాలను తీసుకుంటున్నారని దుయ్యబట్టారు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదేనా? అని ప్రశ్నించారు.