అంతర్జాతీయ ప్రమాణాలతో అత్యాధునిక టెక్నాలజీతో రానుంది కొత్త ఉస్మానియా హాస్పిటల్. వీలైనంత త్వరగా ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టింది ప్రభుత్వం. డిజైన్లు దాదాపు ఖరారు కావడంతో శుక్రవారం (జనవరి 31)న నూతన భవన నిర్మాణాలకు శంకుస్థాపన చేయనున్నారు సీఎం రేవంత్‌రెడ్డి. ఈ విషయాన్ని స్వయంగా ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ వెల్లడించారు.
ఉస్మానియా హాస్పిటల్ నూతన భవనాల డిజైన్లపై బుధవారం ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సమీక్ష నిర్వహించారు. దీనికి ఆరోగ్య, ఆర్ అండ్ బీ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. డిజైన్ల మార్పులపై ఈనెల 25న కీలక సూచనలు చేశారు సీఎం రేవంత్‌రెడ్డి. డిజైన్లు దాదాపు ఖరారు కావడంతో వాటికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు మంత్రి. ఈనెల 31న నూతన భవన నిర్మాణాలకు శంకుస్థాపన చేయనున్న సీఎం రేవంత్‌రెడ్డి.
వరల్డ్ క్లాస్ సదుపాయాలతో ఉస్మానియా కొత్త హాస్పిటల్ నిర్మాణం కానుంది. 30 లక్షల స్క్వేర్ ఫీట్లతో దీన్ని ఏర్పాటు చేస్తున్నారు. 2 వేల పడకలు అందుబాటులో ఉంటాయి. ప్రస్తుతం ఉస్మానియా హాస్పిటల్‌లో 22 డిపార్ట్‌మెంట్లు ఉన్నాయి. అదనంగా మరో 8 డిపార్ట్‌మెంట్లు రాబోతున్నాయి.
స్టాఫ్, స్టూడెంట్స్ కోసం ప్రత్యేక భవనాలు ఉండనున్నాయి. ప్రతి గదిలో గాలి, వెలుతురు ఉండేలా డిజైన్లలో మార్పులు చేశారు. రెండు ఫ్లోర్లలో సెల్లార్ పార్కింగ్ వ్యవస్థ ఉండనున్నాయి. దేశంలో అత్యంత విశాలమైన పార్కింగ్ వ్యవస్థ కలిగిన హాస్పిటల్‌గా ఉస్మానియా కొత్త రికార్డు క్రియేట్ చేయనుంది.
అన్నిరకాల సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలకు కేరాఫ్ కానుంది ఉస్మానియా కొత్త హాస్పటల్. ప్రతి డిపార్ట్‌మెంట్‌కు ప్రత్యేకంగా ఆపరేషన్ థియేటర్లు ఉండనున్నాయి. థియేటర్‌కు అనుబంధంగా పోస్ట్ ఆపరేటివ్, ఐసీయూ వార్డులు ఏర్పాటు చేస్తున్నారు. గ్రౌండ్ ఫ్లోర్‌లో ఒకే చోట అన్నిరకాల డయాగ్నసిస్ సేవలు ఉండనున్నాయి.
ఇక పేషెంట్ అటెండెంట్ల కోసం ఆసుపత్రి ఆవరణలో ధర్మశాల నిర్మిస్తున్నారు. స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఫెసిలిటీస్ కూడిన ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంటేషన్ యూనిట్ ఉండనుంది. పేషెంట్ల సహాయకుల కోసం ఆవరణలో ధర్మశాలను నిర్మించబోతున్నామన్నది మంత్రి దామోదర రాజనర్సింహ మాట. అత్యాధునిక టెక్నాలజీతో మార్చురీ ఉండనుంది. ఎలాంటి ట్రాఫిక్ సమస్యలు లేకుండా ఆసుపత్రి నలువైపులా రోడ్లు నిర్మించనున్నారు.
ఉచిత భోజన సదుపాయం కల్పిస్తామన్నారు. హాస్పిటల్ సానిటేషన్, టాయిలెట్ల నిర్వాహణ కోసం ప్రత్యేక వ్యవస్థను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే కార్పొరేట్ హాస్పిటళ్లకు కొత్త ఉస్మానియా ఏ మాత్రం తీసిపోదు. ఫైర్ స్టేషన్, పోలీస్ అవుట్ పోస్ట్ కొత్త ఉస్మానియాలో అందుబాటులో ఉంటాయి.