స్థానిక సంస్థల ఎన్నికలపై రేవంత్ సర్కార్ దృష్టి పెట్టిందా? వచ్చేవారం రిపోర్టు కేబినెట్ సబ్ కమిటీ ముందుకు రానుందా? రాష్ట్రంలో 55 శాతం బీసీలు ఉన్నట్లు తేలిందా? రిజర్వేషన్లు పెంపుపై లీగల్ ఒపీనియన్‌కు సిద్ధమవుతుందా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కులగణన దాదాపు పూర్తి అయ్యింది. డేటా ఎంట్రీ పూర్తి కావడంతో మరో రెండురోజుల్లో ముసాయిదా నివేదికను ప్రభుత్వానికి సమర్పించనుంది. బుధవారం సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ మీటింగ్‌లో సర్వేపై అధికారులు, ఉద్యోగులకు అభినందనలు తెలిపారు. కొన్ని కుటుంబాలు నిరాకరించడం వల్ల కేవలం నాలుగు శాతం వివరాలు రాలేదని వివరించారు.
రాష్ట్రంలో దాదాపు 1.16 కోట్ల కుటుంబాలను గుర్తించారు అధికారులు. ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరించారు ఎన్యూమరేటర్లు. కులగణన సర్వే రిపోర్టును వచ్చేనెల రెండులోగా కేబినెట్ సబ్ కమిటీకి సమర్పించాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. రాష్ట్రంలో 55 శాతం వరకు బీసీలు ఉన్నట్లు సర్వేలో తేలింది.
జిల్లాలు, మండలాలు, గ్రామాల వారీగా ప్రతి కులానికి సంబంధించి ఎంతమంది ఉన్నారు? సామాజిక, ఆర్థిక పరిస్థితులేమిటి? అనేది బయటకు రానుంది. ఏయే కులాలు రాజకీయంగా, ప్రభుత్వ ఉద్యోగాల పరంగా ఉన్నాయో నివేదికలో ప్రస్తావించారు. కులగణన, బీసీ డెడికేటెడ్ రిపోర్టులపై వచ్చేనెల మొదటివారంలో జరగనున్న కేబినెట్లో చర్చించే అవకాశమున్నట్లు ప్రభుత్వ వర్గాల మాట.
కేబినెట్ ఆమోద ముద్ర తర్వాత ప్రభుత్వం ముందుకు వెళ్లనుంది. వీలైతే అసెంబ్లీ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ఆలోచన సైతం చేస్తోంది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం.. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు 50 శాతానికి మించరాదు. ప్రస్తుతం బీసీ కులాలకు 23 శాతం మాత్రమే రిజర్వేషన్ అమలు అవుతోంది.
కులగణన సర్వేలో వచ్చిన వివరాల ఆధారంగా రిజర్వేషన్‌ను పెంచే ఛాన్స్ ఉంది. ఒకవేళ 50 శాతానికి రిజర్వేషన్ పెరిగితే కేంద్రం ఆమోదం అవసరం. ఈ విషయమై కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరనుంది. బీసీ రిజర్వేషన్ల పెంపు ఎలా అన్నదానిపై ప్రభుత్వం లీగల్ ఒపీనియన్ తీసుకోనుంది. ఇప్పటికే దీనికి సంబంధించి నివేదికను అడ్వకేట్ జనరల్‌కు పంపినట్టు అంతర్గత సమాచారం. లీగల్ ఒపీనియన్, కులగణన రిపోర్టు ఫిబ్రవరి రెండుకు ప్రభుత్వానికి అందే ఛాన్స్ ఉంది.