తెలంగాణలో వీసాల వెంకన్నగా గుర్తింపు పొందింది ప్రముఖ ఆలయం చిలుకూరు బాలాజీ స్వామి. ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ దాడి కేసు కొత్త మలుపు తిరిగింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు వీర రాఘవరెడ్డిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఆయన్ని కోర్టులో హాజరు పరిచారు మొయినాబాద్ పోలీసులు. వీర రాఘవరెడ్డికి 14 రోజులపాటు రిమాండ్ విధించింది న్యాయస్థానం. అక్కడి నుంచి వీర రాఘవ రెడ్డిని చంచల్ గూడ జైలుకు తరలించారు పోలీసులు.
ఇదిలావుండగా వీర రాఘవరెడ్డి అరాచకాలు ఒకొక్కటిగా బయటపడుతున్నాయి. రామరాజ్యం పేరుతో తనకి ప్రత్యేక చట్టం ఉందంటూ ప్రచారం చేసినట్టు తెలుస్తోంది. తనకు ప్రత్యేకమైన హక్కులు ఉన్నాయంటూ యూట్యూబ్‌లో ప్రచారం చేసిన వీడియోలు బయటకు వస్తున్నాయి. ప్రభుత్వానికి సమానంగా తన సైన్యం పని చేస్తుందని అందులో వ్యాఖ్యానించారు. మరోవైపు వీర రాఘవరెడ్డి వ్యవహార శైలిలో మండిపడుతున్నాయి హిందూ సంఘాలు. హిందువులపై దాడికి పాల్పడుతున్నాడంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
రంగరాజన్‌పై దాడి చేసిన వీర రాఘవరెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు రంగరాజన్ మద్దతుదారులు. హిందువుల కోసం కష్టపడి పని చేస్తున్న అర్చకుడు రంగరాజన్‌పై దాడి చేశాడంటే ఇతని వెనుక ఎవరున్నారు? బయటకు తీయాలని డిమాండ్ చేస్తున్నాయి. మరోవైపు వీర రాఘవరెడ్డి అనుచరుల కోసం గాలిస్తున్నారు మొయినాబాద్ పోలీసులు.
శుక్రవారం తెల్లవారుజామున చిలుకూరు ఆలయం సమీపంలో ప్రధాన పూజారి సీఎస్ రంగరాజన్‌పై దాడి చేశాడు వీర రాఘవరెడ్డి, ఆయన మద్దతుదారులు. ఈ ఘటన తర్వాత ఆయన ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నాడు. వెంటనే పోలీసులు బృందాలు రంగంలోకి దిగాయి. చివరకు ఆదివారం సాయంత్రం అరెస్టు చేశారు.
రంగరాజన్‌కు అంతర్గతంగా గాయాలు కావడంతో ట్రీట్‌మెంట్ కోసం సిటీలో ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత డిశ్చార్జ్ చేశారు. మొయినాబాద్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వీర రాఘవ రెడ్డికి ‘సొసైటీ ఆఫ్ రామరాజ్యం’తో సంబంధం ఉందన్నారు.
శుక్రవారం ఉదయం 20 మందితో కలిసి ఆలయ సమీపంలోని రంగరాజన్ నివాసానికి చేరుకున్నాడు. రామరాజ్య స్థాపనకు వీరరాఘవరెడ్డి చేసిన ప్రతిపాదనను రంగరాజన్ తిరస్కరించారు. దీంతో ఇరువురు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇదే క్రమంలో రంగరాజన్ కుమారుడు జోక్యం చేసుకోవడానికి ప్రయత్నించగా, అతనిపై కూడా దాడి చేశారు.