సీఎం రేవంత్ రెడ్డి నేడు ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద సహాయక చర్యలపరిశీలనకు వెళ్లడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు ఘాటుగా స్పందించారు. మీ రాజకీయ ప్రయోజనాల కోసం సాంకేతికపరమైన అంశాలు నిర్లక్ష్యం చేసి ఆదరాబాదరాగా ఎస్ఎల్బీసీ పనులను పరుగెత్తించారని విమర్శించారు. కార్మికులు వద్దని వారిస్తున్నా వినకుండా వారిని మృత్యుకుహరంలోకి నెట్టారని మండిపడ్డారు. కార్మికుల ప్రాణాలు బలితీసుకుని ఇప్పుడు కుహనా ఏడ్పులు ఏడుస్తున్నారని ధ్వజమెత్తారు.
నీకు నిజాయతీ ఉంటే ఎస్ఎల్బీసీ ప్రమాదంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి దోషులు ఎవరో తేల్చాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. పచ్చి అబద్ధాలు మాట్లాడడం, నోటికి వచ్చినట్టు కారుకూతలు కూయడం ఇక ఆపేయాలని… ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే పనులు జరగవని, ఒళ్లు వంచి పనిచేస్తేనే పనులు జరుగుతాయని తెలిపారు. 15 నెలలైనా నీకు జ్ఞానోదయం కాకపోవడం తెలంగాణ దౌర్భాగ్యం అని హరీశ్ రావు పేర్కొన్నారు.
“కేసీఆర్ హయాంలో ప్రాజెక్టుల పనులు ఆగలేదు కాబట్టే రేవంత్ రెడ్డి అప్పుడేమీ మాట్లాడలేకపోయాడు. నిధులు ఖర్చు చేయకుండానే 11.48 కిలోమీటర్ల మేర టన్నెల్ పనులు జరిగాయా? 2014 నుంచి 2023 వరకు రూ.3,900 కోట్లు ఖర్చు చేసి 11.48 కిలోమీటర్ల మేర టన్నెల్ తవ్విన విషయాన్ని ఎందుకు దాచిపెడుతున్నారు? కేసీఆర్ అంటే పచ్చని పంట పొలాలు… రేవంత్ రెడ్డి అంటే పచ్చి అబద్ధాలు అని ప్రజలకు కూడా అర్థమైంది.
మేం పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రితో సత్సంబంధాలు కొనసాగించాం… అంతే తప్ప పక్క రాష్ట్ర సీఎం తరఫున సూట్ కేసులు మోయలేదు. ఏపీ సీఎం చంద్రబాబు రోజుకు 10 వేల క్యూసెక్కులు తరలించుకుపోతున్నాడు… ప్రశ్నిస్తున్న మాపై రంకెలు వేయడం కాదు… నీకు చేతనైతే చంద్రబాబుపై యుద్ధం ప్రకటించు.
బీజేపీతో పగలు కుస్తీ… రాత్రి దోస్తీ. ఎస్ఎల్బీసీ టన్నెల్ సందర్శనకు వచ్చిన బీఆర్ఎస్ నేతలను ఎందుకు ఆపారు? బీజేపీ నేతలకు ఎలా స్వాగతం పలికారు?” అంటూ హరీశ్ రావు విమర్శనాస్త్రాలు సంధించారు.