TELANGANA

ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బీఆర్ఎస్ కు జై కొట్టేందుకు జనం సిద్ధంగా ఉన్నారు: కేసీఆర్..

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేడు ఎర్రవెల్లి ఫాంహౌస్ లో పార్టీ నేతలతో సమావేశమయ్యారు. వారికి భవిష్యత్ దిశానిర్దేశం చేశారు. తెలంగాణ ప్రజలు ఇవాళ కష్టాల్లో ఉన్నారని, కాంగ్రెస్ హామీలు నమ్మి మోసపోయి గోసపడుతున్నారని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిజస్వరూపం ఏంటో ప్రజలకు అర్థమైందని, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బీఆర్ఎస్ కు జై కొట్టేందుకు సిద్ధంగా ఉన్నారని కేసీఆర్ స్పష్టం చేశారు.

 

బీఆర్ఎస్… తెలంగాణ ప్రజలు నిర్మించుకున్న రాజకీయ అస్తిత్వ పార్టీ అని స్పష్టం చేశారు. నేడు బీఆర్ఎస్ తోనే తమకు రక్షణ అని ప్రజలు భావిస్తున్నారని తెలిపారు.

 

ఇక, ఏప్రిల్ 27కి బీఆర్ఎస్ పార్టీ పుట్టి పాతికేళ్లు కావొస్తుండడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా సిల్వర్ జూబ్లీ వేడుకలు నిర్వహిద్దామని పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా వరంగల్ జిల్లాలో లక్ష మందితో సభ నిర్వహిద్దామని అన్నారు. త్వరలోనే సభా వేదిక స్థలాన్ని నిర్ణయిస్తామని చెప్పారు.

 

కాగా, బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ వేడుకల్లో యావత్ తెలంగాణ సమాజానికి భాగస్వామ్యం ఉందని కేసీఆర్ అన్నారు. వరంగల్ సభ అనంతరం పార్టీని క్షేత్రస్థాయి వరకు బలోపేతం చేసి, కొత్త కమిటీలను నియమిస్తామని వివరించారు. పార్టీలో యువత, మహిళల ప్రాతినిధ్యం పెంచుతామని పేర్కొన్నారు.