TELANGANA

మంత్రి పదవి పై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..!

తెలంగాణలో మంత్రివర్గ విస్తరణకు కాంగ్రెస్ అధిష్ఠానం ఆమోదం తెలిపినట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో, కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు మంత్రి పదవి దక్కడం పక్కా అని, ఆ మేరకు పార్టీ హామీ ఇచ్చిందని తెలిపారు. అయితే, కొందరు కావాలనే రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన మాజీ మంత్రి జానారెడ్డి పేరును ప్రస్తావించారు.

 

ధర్మరాజులా వ్యవహరించాల్సిన జానారెడ్డి వంటి సీనియర్ నేతలు ధృతరాష్ట్రుడి పాత్ర పోషిస్తున్నారని విమర్శించారు. జానారెడ్డి 30 ఏళ్లు మంత్రిగా పనిచేశారని… కానీ రంగారెడ్డి, హైదరాబాద్‌ జిల్లాలకు పదవులు ఇవ్వాలని ఆయనకు ఇప్పుడు గుర్తుకు వచ్చిందా? అని రాజగోపాల్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నకు మంత్రి పదవి ఉందని, తమ్ముడికి మంత్రి పదవి ఇవ్వకూడదా? అని ప్రశ్నించారు.

 

తాను పదవుల కోసం ఎవరి వద్ద యాచించనని, మంత్రి పదవి అనేది అడుక్కుంటే వచ్చేది కాదని అన్నారు. చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో రాజగోపాల్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.