TELANGANA

మూసి వరదలపై హైడ్రా ఫోకస్..!

అసాధారణమైన వర్షాలకు హైదరాబాద్‌ అతలాకుతలం అవుతోంది. గట్టిగా వాన పడిందంటే చాలు.. భాగ్యనగరం సంద్రంగా మారుతుంది. ఈ క్రమంలో నగరానికి వ‌ర్షాకాల వ‌ర‌ద‌ముప్పు త‌ప్పించ‌డానికి తీసుకోవాల్సిన చ‌ర్యల‌పై హైడ్రా మేధోమ‌ధ‌నం చేసింది. మూసీన‌ది సరిహద్దు గుర్తింపు, ORR లోపల నాలా నెట్‌వ‌ర్కులతో పాటు మూసీ వెడ‌ల్పుల‌ నిర్ధారణ అనే అంశంపై హైడ్రా స‌ద‌స్సు నిర్వహించింది.

 

మూసీ సుంద‌రీక‌ర‌ణ ప్రాజెక్టుతో ఎలాంటి సంబంధం హైడ్రాకు లేన‌ప్పటికీ.. మూసీ ఆక్రమ‌ణ‌ల‌పై హైడ్రాకు అందుతున్న ఫిర్యాదుల నేప‌థ్యంలో.. అస్సలు ఆ న‌ది స‌రిహ‌ద్దుల నిర్ధార‌ణ ఎలా చేప‌ట్టాల‌నే విష‌య‌మై చ‌ర్చించారు. రెవెన్యూ, స‌ర్వేఆఫ్ ఇండియా, ఇరిగేష‌న్‌, హైడ్రాల‌జీ, SNDP, NRSC, GHMC, మూసీ రివ‌ర్ ఫ్రంట్ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పరేష‌న్‌తో పాటు..అర్బన్ డెవ‌ల‌ప్‌మెంట్‌లో భాగ‌స్వామ్యం అవుతున్న ప‌లు సంస్థల‌కు చెందిన నిపుణులు ఈ సదస్సులో భాగస్వామ్యం అయ్యారు.

 

ఈ సందర్భంగా చెరువుల FTLను గుర్తించిన విధంగానే.. మూసీ న‌ది MFLను గుర్తించేందుకు గ్రామ‌, రెవెన్యూ రికార్డుల‌ను దృష్టిలో పెట్టుకుని స‌రిహ‌ద్దులు నిర్ధారించాల‌ని కొంత‌మంది సూచించారు. మూసీ ప‌రివాహ‌క ప్రాంతం హైడ్రాల‌జీ నివేదిక‌లు, NRSC శాటిలైట్ ఇమేజీలు, స‌ర్వే ఆఫ్ ఇండియా రికార్దుల‌ను కూడా ప‌రిశీలించాలని సూచించారు. దీని ప్రకారం మూసీ హ‌ద్దుల‌ను నిర్ధారించి నిర్మాణాలు జ‌ర‌గ‌కుండా చూడాల‌ని హైడ్రాను కోరారు. హైదరాబాద్‌ న‌గ‌రంలో 1908, 1954, 2000, 2008 సంవ‌త్సరాల‌లో కురిసిన భారీ వ‌ర్షాలు..అప్పుడు తలెత్తిన ప‌రిణామాల‌ను చ‌ర్చించి మూసీ న‌దీ ప‌రీవాహ‌కంలో వరద ప్రవాహానికి ఎక్కడా ఆటంకాలు లేకుండా చూడాల‌న్నారు. అలాగే న‌గ‌రంలో నాలాలు కుంచించుకుపోకుండా చూడాల‌ని ప‌లువురు విజ్ఞప్తి చేశారు.

 

మరోవైపు జీహెచ్ఎంసీ ప‌రిధిలో 940 ప్రాంతాల్లో క‌ల్వర్టులున్నాయ‌ని.. అక్కడ చెత్త పేరుకుపోవ‌డంతో వ‌ర్షపు నీరు సాధార‌ణంగా వెళ్లడంలేద‌ని అంశాన్ని ఈ సదస్సులో ప్రస్తవించారు. ప‌లు చోట్ల నాలాల లింకు క‌ట్ అయ్యంద‌ని.. దానిని పున‌రుద్ధరించాల‌న్నారు. కొన్ని చోట్ల కుంచించుకుపోయాయ‌ని.. అక్కడ నిర్మాణాల‌కు ఎలాంటి ముప్పు లేకుండానే కుదిరితే విస్తర‌ణ లేదంటే మ‌ళ్లింపు చేయాల‌ని ప‌లువురు సూచించారు. న‌గ‌రాభివృద్ధికి ప్రణాళిక‌లు రూపొందించిన‌ప్పడు ర‌హ‌దారుల వెడ‌ల్పు విష‌యంలో ఎలాంటి ఆలోచ‌న చేస్తున్నామో.. నాలాల నిర్మాణంలో కూడా అదే పాటించాల‌ని ప‌లువురు పేర్కొన్నారు. నాలాల తీరుతెన్నుల‌పై స‌మ‌గ్ర స‌ర్వే చేసి స‌రైన ప్రణాళిక‌లు సూచించాల‌ని ప‌లువురు హైడ్రాను కోరారు.