TELANGANA

తెలంగాణ సహా ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనబోయే అయిదు రాష్ట్రాల్లో అధికారంలోకి రావాలనే పట్టుదల

న్యూఢిల్లీ: తెలంగాణ సహా ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనబోయే అయిదు రాష్ట్రాల్లో అధికారంలోకి రావాలనే పట్టుదలతో ఉంది కాంగ్రెస్ పార్టీ. దీనికి అనుగుణంగా భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకుంటోంది.

వాటిని అంతే పక్కాగా ఎగ్జిక్యూట్ చేయడానికి కసరత్తు పూర్తి చేస్తోంది.

ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనబోతోన్న రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లల్లో అధికారాన్ని నిలబెట్టుకోవడంతో పాటు తెలంగాణ, మధ్యప్రదేశ్, మిజోరంలల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన వ్యూహాలను రూపొందించుకోవడంలో తలమునకలైంది ఈ గ్రాండ్ ఓల్డ్ పార్టీ. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యాలయంలో వరుస భేటీలు ఏర్పాటవుతున్నాయి.

అధికార బీజేపీ- ఎన్డీఏ దూకుడును అడ్డుకోవడానికి దేశవ్యాప్తంగా ప్రతిపక్షాలన్నింటినీ ఏకతాటిపైకి తీసుకుని రాగలిగింది. ఇండియా పేరుతో ప్రతిపక్ష పార్టీలతో ఉమ్మడి ఐక్య కూటమిని ఏర్పాటు చేసుకుంది. వారికి దిశానిర్దేశం చేసే బాధ్యతలను స్వీకరించింది కాంగ్రెస్. అటు పార్లమెంట్ ఉభయ సభల్లో ప్రతిపక్ష సభ్యులకు సారథ్యాన్ని వహిస్తోంది.

ఈ పరిణామాల మధ్య- రాహుల్ గాంధీ ఢిల్లీలో విస్తృతంగా పర్యటించారు. సాధారణ పౌరుడిలా కలియతిరిగారు. ఈ మధ్యాహ్నం ఆయన ఢిల్లీలోని కీర్తినగర్‌కు వెళ్లారు. ఫర్నిచర్ మార్కెట్‌కు పెట్టింది పేరు కీర్తినగర్. ఆసియాలోనే అతిపెద్ద ఫర్నిచర్ మార్కెట్ ఇదే. పలు రాష్ట్రాలకు ఇక్కడి నుంచే ఫర్నిచర్ సప్లై అవుతుంటుంది. వేలాదిమంది కార్మికులు కీర్తినగర్ ఫర్నిచర్ మార్కెట్‌లో పని చేస్తుంటారు.

ఈ ఏరియాలో రాహుల్ గాంధీ పర్యటించారు. కార్పెంటర్ షాపులను సందర్శించారు. వడ్రంగులతో ముచ్చట్లు పెట్టారు. వారి సాధకబాధకాలను అడిగి తెలుసుకున్నారు. వారికి అందుతోన్న వేతనాల గురించి ఆరా తీశారు. కొద్దిసేపు చెక్కలకు తోప్డా పట్టారు. కార్పెంటర్లల్లో కార్పెంటర్‌గా కనిపించారు రాహుల్ గాంధీ.

ఇటీవలే ఆయన ఢిల్లీ ఆనంద్ విహార్ రైల్వే స్టేషన్‌కు వెళ్లిన విషయం తెలిసిందే. పోర్టర్లతో సమావేశం అయ్యారాయన. సూట్ కేసులను సైతం మోశారు. అనంతరం ఛత్తీస్‌గఢ్‌లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. రోడ్ షోలను నిర్వహించారు. ఆ సమయంలో బిలాస్‌పూర్ నుంచి రాయ్‌పూర్ వరకు రైలులో ప్రయాణించారు.