మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత కాకాణి గోవర్ధన్ రెడ్డిని పోలీసులు తమ అదుపులోకి తీసుకున్నారు. అక్రమ టోల్ గేట్ నిర్వహణకు సంబంధించిన కేసులో ఆయన్ను విచారించేందుకు న్యాయస్థానం పోలీసులకు అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఈరోజు, రేపు ఆయనను పోలీసులు విచారించనున్నారు.
వివరాల్లోకి వెళితే… కాకాణి గోవర్ధన్ రెడ్డిపై నమోదైన అక్రమ టోల్ గేట్ కేసులో విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో మరింత లోతైన విచారణ జరిపేందుకు, ఆయన్ను తమ కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం, పోలీసుల అభ్యర్థనను అంగీకరిస్తూ కస్టడీకి అనుమతులు మంజూరు చేసింది.
కోర్టు ఆదేశాల మేరకు ఈ రోజు, రేపు కాకాణిని నెల్లూరులోని పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌లో విచారించనున్నారు. ఇందుకోసం అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ విచారణలో టోల్ గేట్ కేసుకు సంబంధించి కీలక సమాచారాన్ని రాబట్టే అవకాశం ఉందని భావిస్తున్నారు.
ఇదిలా ఉండగా, కాకాణి గోవర్ధన్ రెడ్డిపై క్వార్ట్జ్ అక్రమ తవ్వకాలకు సంబంధించిన కేసు కూడా ఉన్న విషయం తెలిసిందే. గతంలో ఆ కేసులో కూడా పోలీసులు ఆయన్ను కస్టడీకి తీసుకుని విచారించారు. ప్రస్తుత విచారణలో టోల్ గేట్ కేసుతో పాటు క్వార్ట్జ్ కేసుకు సంబంధించి కూడా పోలీసులు ఆయన్ను ప్రశ్నించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.