TELANGANA

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిపై వీడిన ఉత్కంఠ.. కొత్త సారథిగా రామచందర్‌రావు..

తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి ఎవరిని వరిస్తుందనే దానిపై కొద్దిరోజులుగా నెలకొన్న తీవ్ర ఉత్కంఠకు తెరపడింది. పలువురు సీనియర్ నేతల పేర్లు ప్రముఖంగా వినిపించినప్పటికీ అధిష్ఠానం అనూహ్యంగా మాజీ ఎమ్మెల్సీ ఎన్. రామచందర్‌రావును కొత్త అధ్యక్షుడిగా ఎంపిక చేసింది. ఈ మేరకు ఆయన పేరును ఖరారు చేస్తూ, వెంటనే నామినేషన్ దాఖలు చేయాలని పార్టీ హైకమాండ్ ఆదేశాలు జారీ చేసింది. దీంతో రామచందర్‌రావు ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు తన నామినేషన్‌ను సమర్పించనున్నారు.

 

రాష్ట్రంలో పార్టీ పగ్గాలను ఎవరికి అప్పగించాలనే అంశంపై బీజేపీ అగ్రనాయకత్వం తీవ్రంగా కసరత్తు చేసింది. ముఖ్యంగా మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్, రాజ్యసభ సభ్యుడు కె. లక్ష్మణ్ వంటి నేతల పేర్లు అధ్యక్ష పదవి రేసులో బలంగా వినిపించాయి. అయితే, అన్ని సమీకరణాలను బేరీజు వేసుకున్న అధిష్ఠానం చివరికి రామచందర్‌రావు వైపే మొగ్గు చూపింది. ఆయన అభ్యర్థిత్వానికి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆరెస్సెస్)తో పాటు పార్టీలోని కొందరు సీనియర్ నాయకులు గట్టిగా మద్దతు తెలిపినట్లు స‌మాచారం.

 

రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని సమర్థవంతంగా ఎదుర్కోవడం, రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులను సిద్ధం చేయడం, క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయడం వంటి కీలక సవాళ్లను దృష్టిలో ఉంచుకునే కొత్త అధ్యక్షుడి ఎంపిక జరిగినట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో రామచందర్‌రావు నియామకంతో పార్టీలో కొత్త శకం ప్రారంభం కానుందని బీజేపీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.