తెలంగాణలోని పాశమైలారం సిగాచీ పరిశ్రమలో ఈ ఏడాది జూన్లో జరిగిన భారీ అగ్ని ప్రమాదం, 54 మంది కార్మికుల మృతికి కారణమైన ఘటనపై తెలంగాణ హైకోర్టు గురువారం (నవంబర్ 27) పోలీసుల దర్యాప్తు తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రమాదం జరిగి ఐదు నెలలు కావస్తున్నా, ఇప్పటికీ బాధ్యులను గుర్తించకపోవడంపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్ ప్రశ్నల వర్షం కురిపించారు.
“54 మంది కార్మికులు చనిపోయిన ఈ ప్రమాదం సాధారణ ఘటన కాదు. ఇప్పటికీ దర్యాప్తు కొనసాగుతోందని చెప్పడం ఏంటి? 237 మంది సాక్షులను విచారించినా పురోగతి లేదా? ఈ దుర్ఘటనకు కారణమైన వారిని ఇప్పటివరకు మీరు గుర్తించలేదా?” అంటూ సీజే ప్రశ్నించారు. ఇంత పెద్ద ఘటన జరిగితే దర్యాప్తు అధికారిగా ఒక డీఎస్పీని నియమిస్తారా? అంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రమాదంపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసి ఉండొచ్చు కదా? అని కూడా సీజే వ్యాఖ్యానించారు.
కాగా, ప్రభుత్వ నియమించిన సాంకేతిక నిపుణుల కమిటీ ఇటీవల ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో, యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం సంభవించిందని స్పష్టం చేసింది. కార్మికుల భద్రతను గాలికొదిలేయడం, సరైన అగ్ని ప్రమాద నివారణ వ్యవస్థ లేకపోవడం, మండే స్వభావమున్న రసాయనాలను నిబంధనలకు విరుద్ధంగా నిల్వ చేయడమే భారీ ప్రాణనష్టానికి కారణమని నివేదికలో పేర్కొంది. హైకోర్టు దర్యాప్తుపై ఏఏజీ నివేదిక దాఖలు చేయాలని ఆదేశించడంతో పాటు, తదుపరి విచారణకు దర్యాప్తు అధికారి కోర్టు ఎదుట హాజరు కావాలని ఆదేశిస్తూ, విచారణను డిసెంబర్ 9కి వాయిదా వేసింది.

