కొడంగల్ వేదికగా జరిగిన సభలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు తనను రాజకీయంగా అణచివేయడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేశారని ఆరోపించారు. కేసీఆర్ హయాంలో తనపై ఏకంగా 181 కేసులు పెట్టారని, అక్రమంగా చంచల్‌గూడ జైలులో బంధించి తన కుటుంబాన్ని తీవ్ర మానసిక క్షోభకు గురిచేశారని పేర్కొన్నారు. ఒక సామాన్య కార్యకర్తగా ఉన్న తనను జైలు పాలు చేసి, ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం చేశారని ఆయన మండిపడ్డారు.
తాను ఇప్పుడు అధికారంలో ఉన్నప్పటికీ కేసీఆర్‌పై కక్ష సాధింపు చర్యలకు దిగడం లేదని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. “ఆయన చేసిన పాపాలకు ఆయనే ప్రకృతి పరంగా శిక్ష అనుభవిస్తారని నేను వదిలేశాను. అందుకే తాను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజే ఆయన నడుము విరిగి కింద పడ్డారు” అని వ్యాఖ్యానించారు. కేసీఆర్ ప్రస్తుతం తన ఎర్రవల్లి ఫామ్ హౌస్‌నే ఒక బందీఖానాగా మార్చుకున్నారని, బయటకు రాలేని స్థితిలో ఒంటరిగా గడపడమే ఆయనకు దేవుడు ఇచ్చిన శిక్ష అని ఎద్దేవా చేశారు.
కేసీఆర్‌ను జైలుకు పంపాలనే డిమాండ్లపై రేవంత్ రెడ్డి తనదైన శైలిలో స్పందించారు. కేసీఆర్‌ను జైలులో పెడితే అనవసరంగా ప్రభుత్వానికి భోజనం, వసతి ఖర్చులు పెరుగుతాయని.. ఆయనకు ఫామ్ హౌస్‌లో ఉండటమే సరైన శిక్ష అని అన్నారు. “ఆయన ఫామ్ హౌస్ చుట్టూ పహారా కాస్తున్నది నా పోలీసులే.. ఇంతకంటే పెద్ద జైలు ఆయనకు ఏముంటుంది?” అని ప్రశ్నించారు. కేసీఆర్ ఇటీవల చేసిన ‘తోలు తీస్తా’ వ్యాఖ్యలపై స్పందిస్తూ.. తోలు తీయడం కేసీఆర్ ఫామ్ హౌస్‌లో రెండేళ్లు బాగా ప్రాక్టీస్ చేసినట్టు ఉన్నారని సెటైర్లు వేశారు.

