తెలంగాణ శాసనసభ శీతాకాల సమావేశాల తొలిరోజు సభలో అత్యంత ఆసక్తికరమైన సన్నివేశం కనిపించింది. సభ ప్రారంభం కాగానే మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత కేసీఆర్ తన స్థానంలో వచ్చి కూర్చున్నారు. గమనించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేరుగా కేసీఆర్ వద్దకు వెళ్లి మర్యాదపూర్వకంగా కరచాలనం (Shake hand) చేశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకోవడం సభలో అందరి దృష్టిని ఆకర్షించింది.
ముఖ్యమంత్రితో పాటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా కేసీఆర్ వద్దకు వెళ్లి ఆయనను పలకరించారు. రాజకీయాల్లో ఎన్ని విభేదాలు ఉన్నప్పటికీ, సభలో అధికార, ప్రతిపక్ష నేతలు ఇలా మర్యాదపూర్వకంగా పలకరించుకోవడం ఆరోగ్యకరమైన సంప్రదాయానికి నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. జాతీయ గీతాలాపన ముగిసిన అనంతరం స్పీకర్ ప్రశ్నోత్తరాల సమయాన్ని ప్రారంభించారు.
కాసేపు సభలో ఉన్న కేసీఆర్, ఆ తర్వాత అక్కడి నుండి వెనుదిరిగారు. అనంతరం స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రశ్నోత్తరాలను కొనసాగించారు. మరోవైపు శాసనమండలి సమావేశాలు మాత్రం నేటి నుంచి వచ్చే నెలకు వాయిదా పడ్డాయి. తొలిరోజు సమావేశాల్లో భాగంగా దివంగత మాజీ సభ్యులకు సభ సంతాపం ప్రకటించింది.

