బీఆర్ఎస్ పార్టీ ఇక టీఆర్ఎస్ గా మారుబోతుందా అనే చర్చ జరుగుతుంది. పార్టీ వరుస ఓటములతోనే అధిష్టానం త్వరలోనే నిర్ణయం తీసుకోబోతుందనే ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే పార్టీ కేడర్ సైతం టీఆర్ఎస్ గా ఉంటేనే ప్రజల ఆదరణ ఉంటుందని, అది పార్టీ పేరులోంచి తొలగించిన తర్వాతే గడ్డుపరిస్థితులు ఎదుర్కొంటుందని పలువురు బహిరంగంగానే అభిప్రాయపడుతున్నారు. ఒకవైపు పార్టీ కేడర్ ఒత్తిడి, మరోవైపు రాజకీయాల్లో గడ్డుకాలం నేపథ్యంలో మళ్లీ పార్టీ మార్పు చేయబోతున్నారనే ప్రచారం ఊపందుకుంది. రాబోయే ఎన్నికల్లో విజయం సాధించాలంటే బీఆర్ఎస్ పార్టీకి అనివార్యపరిస్థితులు నెలకొన్నాయి.
2014 ,2018 ఎన్నికల్లో..
టీఆర్ఎస్ అంటే తెలంగాణ ఉద్యమ పార్టీ.. నీళ్లు.. నిధులు.. నియామకాల సెంటిమెంటుతో 2001లో పార్టీని కేసీఆర్ స్థాపించారు. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న అప్పటి నుంచి టీఆర్ఎస్ తెలంగాణ పార్టీగా ఉంచుకునేవారు. అదే సెంటిమెంటుతో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 2014 ,2018 ఎన్నికల్లో వరుసగా రెండుసార్లు కూడా టీఆర్ఎస్ అధికారంలో ఉంది.. టీఆర్ఎస్ అంటే తెలంగాణ, తెలంగాణ అంటే టీఆర్ఎస్ అని నినాదం ఉందని బిఆర్ఎస్ నేతలు పదేపదే చెబుతూ వచ్చారు. ఆ తర్వాత టీఆర్ఎస్ పేరుని బీఆర్ఎస్ గా మారుస్తూ పార్టీ అధినేత కేసీఆర్ 2022 డిసెంబర్ 9న నిర్ణయం తీసుకున్నారు. జాతీయ రాజకీయాల్లో కీలకంగా ఉండాలని వివిధ రాష్ట్రాలలో బిఆర్ఎస్ పేరుతోనే పోటీ చేయాలని నిర్ణయం తీసుకొని మహారాష్ట్ర, ఏపీ, పంజాబ్, హర్యానా, యూపీ రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల పర్యటన చేశారు కేసీఆర్. రైతు ఎజెండా లక్ష్యంతో ముందుకు సాగారు.
ప్రజలు దూరం..
ఆ తర్వాత 2023 అసెంబ్లీ ఎన్నికలను బీఆర్ఎస్ పార్టీ అధికారాన్ని కోల్పోయింది. ఒక్కసారిగా రివర్స్ అయింది. అంతేకాదు పార్లమెంటు ఎన్నికల్లో కూడా జీరో స్థానానికి బీఆర్ఎస్ పరిమితమైంది.. ప్రతిపక్షంలోకి వచ్చాక కంటోన్మెంట్ ఉపఎన్నిక తో పాటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బిఆర్ఎస్ ఓటమి చవిచూసింది. బీఆర్ఎస్ బీఆర్ఎస్ గా అవతరించినప్పటినుంచి చాలామంది నేతల్లో ఎమ్మెల్యేల్లో జరిగిన చర్చనే మరోసారి జరుగుతుంది.. ఉద్యమ సెంటిమెంటుగా ఉన్న పార్టీ బీఆర్ఎస్ గా అవతరించిన దగ్గర నుంచి తెలంగాణ ప్రజలు దూరమయ్యారనేది స్పష్టమైంది. తాజాగా టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా మార్చడంతో రాజకీయంగా చాలా నష్టపోయియాం ప్రజల్లో బలంగా నాటుకుపోయిన గులాబీ జెండా, టీఆర్ఎస్ పేరుకు ఉన్న సెంటిమెంట్ విడదీయలేనిది.. మళ్లీ పార్టీని టీఆర్ఎస్ గానే చూడాలని, పాత పేరుతో ముందుకు సాగాలని అనుకుంటున్నాం.. పార్టీలో చర్చిస్తాం.. పార్టీ అధినేత కేసీఆర్ తుది నిర్ణయం తీసుకుంటారు.
రాష్ట్రానికే పరిమితం అవుతారా?
పార్టీ కేడర్ నుంచి ఒత్తిడి వస్తుందని మంచిర్యాల జిల్లాలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పార్టీ పేరుమార్పుపై తీవ్ర చర్చజరుగుతుంది. గతంలో ఎప్పుడు పార్టీ పేరుమార్పుపై ప్రకటన చేయని కేటీఆర్.. తాజాగా మాట్లాడటం రాజకీయ వర్గాల్లోనూ హాట్ టాపిక్ గా మారింది. ఇక కేసీఆర్ రాష్ట్రానికే పరిమితం అవుతారా? అంటే అవుననే సమాధానాలు వస్తున్నాయి. పార్టీ పేరు మార్చితే ఇక జాతీయ రాజకీయాలకు దూరమైనట్లే. రాష్ట్రంలో సత్తాచాటాలంటే టీఆర్ఎస్ అని నామకరణం చేయాల్సిందేనని పార్టీ కేడర్ తోపాటు పార్టీ సీనియర్లు సైతం పలు సందర్భాల్లో అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల నుంచి గట్టెక్కాలంటే ఇతర పార్టీలను రాజకీయంగా ఎదుర్కొవాలంటే ఇది తప్ప మరో మార్గం లేదనేది స్పష్టమవుతోంది.
ప్రజల్లో వ్యతిరేకత..
కేసీఆర్ కు బీఆర్ఎస్ కలిసిరాలేదు. టీఆర్ఎస్ పేరు మార్చిన దగ్గరి నుంచి వరుస ఘటనలు కేసీఆర్ ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. వరుస అగ్ని ప్రమాదాలు అకాల వర్షాలు లిక్కర్ స్కాంలో కుమార్తె కవితకు ఈడీ నోటీసులు విచారణ, మరోవైపు పేపర్ లీక్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాయి. నిరుద్యోగులతో పాటు సంక్షేమ పథకాలు అందుక పోవడంతో ప్రజల్లోనూ వ్యతిరేకత మూటగట్టుకుంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన విషయం తెలిసిందే. ఆతర్వాత పార్లమెంట్, ఎమ్మెల్సీ, పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లోనూ ఆశించిన ఫలితాలు సాధించలేక చతికిలపడింది. మరోవైపు అన్ని రాష్ట్రాల్లోని ప్రాంతీయపార్టీలను ఏకతాటిపైకి తీసుకొచ్చి జాతీయ రాజకీయాల్లో కీలక భూమికపోషించాలని భావించిన కేసీఆర్కు చుక్కెదురైంది.
మళ్లీ టీఆర్ఎస్గా మారుస్తారా?
కవిత పార్టీని పెడుతున్నట్లు సన్నాహాలు చేస్తుంది. ఈ నెల 25న పార్టీని ప్రకటిస్తున్నట్లు వెల్లడించింది. అందుకు ఇప్పటికే కమిటీలు వేసింది. ఒకవైపు ప్రభుత్వంపై మరోవైపు ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పై విమర్శలు గుప్పిస్తుంది. కవిత పార్టీని స్థాపిస్తే బీఆర్ఎస్ కు నష్టమనే ప్రచారం జరుగుతుంది. ఈ తరుణంలో కేటీఆర్ పార్టీ పేరు మార్పుపై తన అభిప్రాయాన్ని ప్రకటించడం ఇప్పడు చర్చకుదారితీసింది. ఇప్పుడే ఎందుకు మాట్లాడారు. గతంలో ఎమ్మెల్యే ఎన్నికల్లో ఓటమిపై సమీక్షలు నిర్వహించినప్పటికీ పార్టీ నేతలు, కేడర్ అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోలేదు. కానీ ఈ నెల 27న పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఉండటంతోనే ముందస్తుగా పార్టీలో చర్చజరగాలని, కవిత పార్టీ వైపు కేడర్ దృష్టిసారించకుండా ఉండేందుకు వేసే ఎత్తుగడలో భాగమేనా అనే ప్రచారం సైతం జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ కేటీఆర్ పార్టీ పేరు మార్పుతో నష్టపోయామనే ప్రకటన ఇప్పుడు హాట్ టాఫిక్ అయింది. అయితే పార్టీ పేరును మళ్లీ టీఆర్ఎస్ గా మారుస్తారా? లేదా? అనేది చూడాలి.

