రానున్న మూడు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణశాఖ తెలిపింది. దక్షిణ అండమాన్ సముద్రం, ప్రక్కనే ఉన్న భూమధ్యరేఖ హిందూ మహాసముద్రం, మలక్కా జలసంధి ద్వారా సముద్ర మట్టానికి 5.8 కి.మీ వరకు విస్తరించి ఉన్న ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని వెల్లడించింది. దీని ప్రభావంతో డిసెంబర్ 05 నాటికి ఆగ్నేయ బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న దక్షిణ అండమాన్ సముద్రం మీదుగా అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. డిసెంబర్ 07 ఉదయం నాటికి ఇది పశ్చిమ వాయువ్య దిశగా పయనించి తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.
డిసెంబర్ 08 ఉదయం నాటికి ఇది ఆగ్నేయ బంగాళాఖాతం మీదుగా పశ్చిమ వాయువ్య దిశగా పయనించి ఉత్తర తమిళనాడులోని పుదుచ్చేరిని ఆనుకుని నైరుతి బంగాళాఖాతం మీదుగా దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరానికి చేరుకునే అవకాశం ఉంది. కాగా ఆంధ్రప్రదేశ్, యానాంలో దిగువ ట్రోపోస్పియర్‌లో ఈశాన్య, తూర్పుగాలులు వీస్తున్నాయి. వాతావరణశాఖ అంచనా ప్రకారం ఈ రోజు(ఆదివారం), రేపు(సోమవారం) ఉత్తర కోస్తా ఆంధ్రాలో ఒకటి లేదా రెండు చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు, దక్షిణ కోస్తా ఆంధ్రాలో నేడు, రేపు ఒకటి రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరోవైపు ఈ మూడు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా తీవ్రమైన చలి గాలులు వీస్తాయని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.