APUncategorized

ఢిల్లీ నుండి పిఠాపురంకు పవన్ కళ్యాణ్ వరాలు..!

ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిఠాపురం కు వరాలు ప్రకటించారు. తన స్వంత నియోజకవర్గం పిఠాపురంకు సంబంధించి, కేంద్ర మంత్రులతో చర్చించి చివరకు గుడ్ న్యూస్ చెప్పారు పవన్ కళ్యాణ్.

 

పిఠాపురం నియోజవర్గం నుండే పవన్ కళ్యాణ్ విజయదుందిభి మోగించిన విషయం అందరికి తెలిసిందే. ఈ నియోజకవర్గం కూటమి జనసేనకు కేటాయించగా పవన్ నేరుగా ఇక్కడి నుండే పోటీ చేసి, సుమారు 70 వేలకు పైగా మెజారిటీ సాధించి రికార్డు సృష్టించారు. తన రాజకీయ ఎదుగుదలకు ఓట్లు వేసి గెలిపించిన పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధికి ఇప్పటికే ఎన్నో చర్యలు చేపట్టారు పవన్. రహదారుల అభివృద్ధితో పాటు, ఎక్కడ కూడా నీటి సమస్య తలెత్తకుండా అధికారులను అప్రమత్తం చేశారు. అలాగే పలు పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు లేకపోవడంతో, వాటిని స్వంత నిధులతో ఏర్పాటు చేయించారు పవన్. ఇలా పిఠాపురం అంటే చాలు.. తమ సమస్యలు పరిష్కారమే అంటున్నారు ప్రజలు.

 

ఇలా పిఠాపురం అభివృద్ధికి ఎన్నో చర్యలు చేపట్టిన పవన్.. ఢిల్లీ పర్యటనలో కేంద్ర రైల్వే మంత్రితో చర్చలు జరిపిన అనంతరం గుడ్ న్యూస్ చెప్పారు. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తో భేటీ అయిన పవన్ కళ్యాణ్.. పిఠాపురంలో పెండింగ్ లో ఉన్న పలు ప్రాజెక్టుల గురించి చర్చించారు. ఈ సందర్భంగా పిఠాపురం మున్సిపాలిటీ పరిధి లోని సామర్లకోట-ఉప్పాడ రహదారిలో రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం అవసరం ఉందని, సత్వరమే ఆర్వోబీని మంజూరు చేయాలని కోరారు.

 

అంతేకాదు పిఠాపురంలోని శ్రీ పాద వల్లభ స్వామి దేవాలయానికి నిరంతరం భక్తులు రాకపోకలు సాగిస్తుంటారని, భక్తులను దృష్టిలో ఉంచుకొని ముఖ్యమైన నాలుగు రైళ్లకు పిఠాపురం రైల్వేస్టేషన్లో హాల్ట్ మంజూరు చేయాలని పవన్ కోరారు. ఈ విషయాన్ని రైల్వే ఉన్నతాధికారులతో చర్చించి వెంటనే సమస్య పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకోనున్నట్లు కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న పవన్ తన నియోజకవర్గ ప్రజల సమస్యలపై చర్చించి, శుభవార్త చెప్పడంతో పిఠాపురం నియోజకవర్గంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.