ఉప రాష్ట్రపతి ఎన్నిక నేడు జరగనుంది. ఉదయం 10 గంటలకు పోలింగ్ మొదలు కానుంది. సాయంత్ర 6 గంటలకు ఓట్లను లెక్కించి, ఫలితాలు వెల్లడించనున్నారు. ఉప రాష్ట్రపతి ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం సర్వం సిద్ధం చేసింది. అధికార NDA అభ్యుర్థికి సంఖ్యాపరంగా మెరుగైన మెజారిటీ ఉండటంతో.. NDA అభ్యర్థి గెలుపు లాంచప్రాయమేననే అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి. అయితే, ఉప రాష్ట్రపతి ఎన్నికలో రహస్య ఓటింగ్ విధానాన్ని అనుసరిస్తారు. మరోవైపు పార్టీలకు అతీతంగా ఎంపీలు ఓటు వినియోగించుకోవాలని విపక్ష అభ్యర్థి ప్రచారం చేస్తున్నారు. దీంతో ఉపరాష్ట్రపతి ఎన్నికపై కాస్త ఉత్కంఠ నెలకొంది.
సీపీ రాధాకృష్ణన్, జస్టిస్ బి. సుదర్శన్‌రెడ్డిల మధ్య పోటీ
జగదీప్ ధన్‌ఖడ్ రాజీనామాతో ఉప రాష్ట్రపతి స్థానం ఖాళీ అయింది. ఈ పదవి కోసం NDA అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్, విపక్షాల ఉమ్మడి అభ్యర్థి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డిలు పోటీ పడుతున్నారు. అధికార NDAకు పూర్తి మెజార్టీ ఉన్నప్పటికీ జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. ఈ ఎన్నికలో రాజ్యసభ, లోక్‌సభ సభ్యులతో కూడుకున్న ఎలక్టోరల్ కాలేజీలో ఎంపీలు తమకు నచ్చిన వారికి ఓటు వేసే వెసులుబాటు ఉంటుంది. అయినప్పటికీ ఎంపీలు తమ పార్టీ అభ్యర్థికే ప్రాధాన్యం ఇస్తారు. క్రాస్ ఓటింగ్ జరిగే అవకాశమూ ఉంటుంది.
ఓటింగ్‌లో పాల్గొననున్న లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు
లోక్‌సభ 542, రాజ్యసభలో 239 సభ్యులు కలిసి మొత్తం ఎలక్టోర్‌ల సంఖ్య 781 ఉంది. ఇందులో ప్రతి సభ్యుడి ఓటు విలువ ఒకటిగానే ఉంటుంది. మెజార్టీ మార్కు 391. అధికార ఎన్డీయే కూటమికి ఇప్పటివరకు 422 సభ్యుల బలం ఉంది. దీంతో ఎన్డీయే కూటమి అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్ గెలుపు ఖాయంగానే కనిపిస్తోంది. YCPకి చెందిన 11 మంది సభ్యులు ఎన్డీయేకు మద్దతు ఇస్తున్నారు. దీంతో మెజార్టీ మరింత పెరగనుంది. ఈ క్రమంలో మరిన్ని పార్టీలు మద్దతు తెలిపే అవకాశం ఉంది. విపక్షాల ఇండియా కూటమికి 311 మంది బలముంది. ఇతరులు 45 మంది ఉన్నారు. వీరితో సహా కొన్ని పార్టీలు మద్దతిచ్చినా విపక్ష అభ్యర్థి విజయానికి దూరంగానే కనిపిస్తున్నారు. దీంతో పార్టీలకు అతీతంగా ఆలోచించి ఓటు వేయాలని విపక్షాల ఉమ్మడి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఇప్పటికే ఎంపీలకు విజ్ఞప్తి చేశారు.
బలాబలాల పరంగా ఎన్డీఏ అభ్యర్థికి పూర్తి మెజార్టీ
మరోవైపు ఈ ఎన్నికకు దూరంగా ఉంటున్నట్లు BRS ప్రకటించింది. దీంతో నలుగురు సభ్యులు ఓటింగ్‌లో పాల్గొనే అవకాశం లేదు. ఏడుగురు ఎంపీలున్న BJD కూడా ఈ ఎన్నికకు దూరంగా ఉంటున్నట్లు ప్రకటించింది. శిరోమణి అకాలీదళ్, జోరమ్ పీపుల్స్ మూమెంట్ వంటి పార్టీలకు ఒక్కో సభ్యులున్నారు. విపక్షాల అభ్యర్థికి మద్దతు ఇస్తున్నట్లు 10 మంది ఎంపీలున్న ఆమ్‌ఆద్మీ పార్టీ ప్రకటించింది. అయితే, ఎంపీ స్వాతి మాలివాల్ ఆ పార్టీతో సంబంధాలు క్షీణించిన నేపథ్యంలో ఆమె ఎవరికి ఓటు వేస్తారనే దానిపై స్పష్టత లేదు. స్వతంత్ర అభ్యర్థులు, ఇతర పార్టీ సభ్యులు ఎవరివైపు మొగ్గు చూపుతారనే విషయంపై ఆసక్తి నెలకొంది.