పారిస్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. ఫ్రాన్స్ పర్యటన ఆరంభమైంది. ఈ మధ్యాహ్నం ఆయన పారిస్‌లో ల్యాండ్ అయ్యారు. విమానాశ్రయంలో ఆయనకు ఘన స్వాగతం లభించింది.
ఫ్రాన్స్ ప్రధానమంత్రి ఎలిజబెత్ బోర్నె స్వయంగా ఎయిర్‌పోర్ట్‌కు వచ్చి మోదీకి స్వాగతం పలికారు. అక్కడే సైనిక వందనాన్ని స్వీకరించారు మోదీ. ప్రవాస భారతీయులు ఆయనను కలుసుకున్నారు.
అనంతరం ఫ్రాన్స్‌లో స్థిరపడిన ప్రవాస భారతీయులతో భేటీ అయ్యారు. ఇండియన్ డయాస్పొరాను ఉద్దేశించి ప్రసంగించారు. చంద్రయాన్ 3 ప్రయోగం సహా అనేక అంశాలను ప్రస్తావించారు. చంద్రయాన్ 3 ప్రయోగానికి కౌంటింగ్ ఆరంభమైందని, ఇంకొన్ని గంటల్లో శ్రీహరికోట నుంచి ఈ రాకెట్‌ను ప్రయోగించబోతోన్నామని చెప్పారు. దేశ అంతరిక్ష పరిశోధన చరిత్రలో ఇది చిరస్థాయిగా నిలిచిపోతుందని పేర్కొన్నారు.
ఫ్రాన్స్‌లో నమస్తే ఇండియా అని ఒకరినొకరు సంబోధించుకుంటే.. భారత్‌లో బోంజోర్ ఇండియా అని పిలుచుకుంటామని అన్నారు. ప్రపంచంలోనే అతి ప్రాచీన భాష తమిళం అని, ఇలా చెప్పుకోవడానికి భారతీయుడిగా గర్విస్తున్నానని ప్రధాని అన్నారు. ఫ్రాన్స్‌లో తిరువళ్లువర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారని చెప్పుకొచ్చారు.
ఫ్రెంచ్ ఫుట్‌బాల్ ప్లేయర్ కైలియన్ ఎంబాప్పేను భారతీయులు బ్రహ్మరథం పడతారని, ఫ్రాన్స్‌లో కంటే భారత్‌లోనే ఆయనకు ఎక్కువ మంది అభిమానులు ఉన్నారని చెప్పారు. వచ్చే 25 ఏళ్లలో అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలనే లక్ష్యంతో భారత్ కృషి చేస్తోందని, పెట్టుబడులకు భారత్‌లో చాలా అవకాశాలు ఉన్నాయని అన్నారు.
విదేశాల్లో స్థిరపడిన భారతీయులందరికీ సౌకర్యాలు, భద్రతను కల్పించడానికి తాము కట్టుబడి ఉన్నామని మోదీ అన్నారు. ఉక్రెయిన్, సూడాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్.. ఇలా ఎలాంటి దేశమైనా.. అక్కడ నివసించే భారతీయుల భద్రత కోసం ఎప్పుడూ ముందుంటామని ఆయన హామీ ఇచ్చారు. ఈ విషయంలో రాజీ పడే ప్రసక్తే ఉండబోదని తేల్చి చెప్పారు.
ఫ్రాన్స్‌లో యూపీఐని ఉపయోగించడానికి ఈ దేశ ప్రభుత్వం అంగీకరించిందని మోదీ ప్రకటించారు. త్వరలోనే ఇది కార్యరూపం దాల్చుతుందని అన్నారు. ప్రఖ్యాత ఈఫిల్ టవర్ వద్ద యూపీఐ చెల్లింపులను లాంఛనంగా ప్రారంభిస్తామని పేర్కొన్నారు. భారతీయ పర్యాటకులు యూపీఐ పేమెంట్స్ ద్వారా స్వదేశ కరెన్సీలో చెల్లింపులు చేయొచ్చని అన్నారు.
ఫ్రాన్స్‌లో చదువుకునే భారతీయ విద్యార్థులకూ ప్రధాని మోదీ తీపి కబురు వినిపించారు. ఫ్రాన్స్‌లో మాస్టర్స్ చదువుతున్న భారతీయ విద్యార్థులకు అయిదు సంవత్సరాల లాంగ్ టర్మ్ పోస్ట్ స్టడీ వీసా ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. మార్సెయిల్‌లో కొత్తగా కాన్సులేట్‌ను ప్రారంభించాలని కూడా నిర్ణయించామని అన్నారు.