ఇండోనేషియాలో భారీ భూకంపం సంభవించింది. సుమత్రా దీవుల్లో భారీ భూకంపం వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. సుమత్రాకు నైరుతి దిశలో బుధవారం ఈ భూకంపం వచ్చినట్లు తేలింది. రిక్టర్ స్కేల్ మీద ఈ భూకంప తీవ్రత 5.5గా నమోదయ్యిందని యూరోపియన్-మెడిటరేనియన్ సిస్మోలాజికల్ సెంటర్ తెలిపింది. భూకంపం కేంద్రం నుంచి 10 కిమీ (6.2 మైళ్లు) లోతులో ఉందని తెలిపింది. ఆ దేశం బాలిలో G20 నేతల శిఖరాగ్ర సమావేశానికి చివరి రోజు ఆతిథ్యం ఇచ్చింది.
ప్రాణ నష్టం, ఆస్తి నష్టం గురించి ఇప్పటివరకు ఎటువంటి నివేదికలు అందలేదు. మరోవైపు.. ఇండోనేషియాలోని బాలిలో రెండు రోజుల పాటు జరిగిన జి-20 సదస్సు బుధవారం ముగిసింది. ఈ రెండు రోజుల్లో అభివృద్ధి, శాంతి ఎజెండాపై చర్చించడానికి ప్రపంచ నాయకులు బాలిలో సమావేశమయ్యారు. దీంతో ఇండోనేషియా వచ్చే ఏడాది పాటు జీ-20 అధ్యక్ష బాధ్యతలను భారత్‌కు అప్పగించింది. ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో అధికారికంగా జి-20 అధ్యక్ష పదవిని ప్రధాని నరేంద్ర మోదీకి అందజేశారు. ఈ గ్రూప్‌కు చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించడం భారత దేశంలోని ప్రతి పౌరుడికి గర్వకారణమని ప్రధాని మోదీ చైర్మన్‌గా స్వీకరిస్తూ అన్నారు.
జి-20లోని ప్రతి సభ్యదేశాల కృషితో ప్రపంచ సంక్షేమానికి మేం దీన్ని ప్రయోజనకరంగా మారుస్తామని మోదీ చెప్పారు. ఇండోనేషియాలో రెండు రోజుల పాటు జరిగిన జి-20 సదస్సు ముగియడంతో దాని సభ్య దేశాలు కూడా సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. విదేశాంగ కార్యదర్శి వినయ్ క్వాత్రా మాట్లాడుతూ ‘జి-20 ఫలితాల పత్రం’ రూపకల్పనలో భారత్ నిర్ణయాత్మక పాత్ర పోషించిందని అన్నారు. భారత్‌కు జి-20 చైర్మన్ పదవి దక్కడంపై బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ మాట్లాడుతూ భారత్‌కు జి-20 అధ్యక్ష పదవి లభించడం చాలా ప్రోత్సాహకరంగా ఉందన్నారు.