కౌలాలంపూర్ కు సమీపంలోని ఒక సేంద్రీయ వ్యవసాయ క్షేత్రంలోని పర్యాటక క్యాంప్ సైట్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. కొండ చరియలు విరిగి పడిన సమయంలో ఆ పర్వత పాదం వద్ద దాదాపు 95 మంది వరకు ఉన్నారు. వారంతా మలేసియన్లేనని ప్రాథమిక సమాచారం. Landslide hits campsite in Malaysia: ఇంకా చాలా మంది మిస్సింగ్ మలేసియాలోని సెంట్రల్ సెలంగోర్ రాష్ట్రంలో ఉన్న బటంగ్ కాలి వద్ద ఉన్న ఒక పర్యాటక వ్యవసాయ క్షేత్రంలో కొండ చరియలు విరిగిపడిన ఘటనలో 16 మృతదేహాలను వెలికి తీశారు. సుమారు 25 మంది ఇంకా శిధిలాల కింద ఉండొచ్చని భావిస్తున్నారు. ఘటనాస్థలి నుంచి సహాయ సిబ్బంది 53 మందిని కాపాడి చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలి కౌలాలంపూర్ కు 51 కిమీల దూరంలో ఉంది.
Landslide hits campsite in Malaysia: క్యాంప్ సైట్ ఘటన జరిగిన ప్రదేశం ప్రముఖ పర్యాటక ప్రాంతం. అక్కడి సేంద్రీయ వ్యవసాయ క్షేత్రంలో పర్యాటకులు క్యాంప్స్ వేసుకుని సమయం గడుపుతుంటారు. ముఖ్యంగా వీకెండ్స్ లో ఇక్కడ పర్యాటకుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. కౌలాలంపూర్ నుంచి పిల్లలతో కలిసి కుటుంబాలు ఇక్కడ రాత్రి బస చేయడం కోసం వస్తుంటాయి. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తరువాత ఈ ప్రమాదం జరిగింది. దాదాపు 30 మీటర్ల ఎత్తు నుంచి కొండ చరియలు విరిగిపడ్డాయి. రాత్రి 2 గంటల సమయంలో పెద్ద శబ్దంతో కొండచరియలు విరిగిపడడం ప్రారంభమవడంతో.. ఆ శబ్దానికి మేలుకున్న కొందరు ప్రమాదం నుంచి తప్పించుకున్నారని ప్రత్యక్ష సాక్షి లియాంగ్ జిమ్ మెంగ్ తెలిపారు. తామున్న టెంట్ పై కూడా భారీగా మట్టి పేరుకుపోయిందని, ఏదో విధంగా బయటపడ్డామని వివరించారు. తాము సురక్షిత ప్రదేశానికి వచ్చిన తరువాత మరో పెద్ధ శబ్దంతో మరోసారి కొండచరియలు విరిగిపడ్డాయని వెల్లడించారు