National

RBI New Rules: రిటైల్ రుణాలపై ఆర్‌బీఐ కఠిన నిబంధనలు.. NBFCలపై ప్రభావం?

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రిటైల్ రుణాలపై మరింత కట్టుదిట్టమైన నియంత్రణకు సిద్ధమవుతోంది. బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (NBFCలు) అందిస్తున్న క్రెడిట్ కార్డులు, ఫ్లెక్సీ లోన్లు, రివాల్వింగ్ క్రెడిట్ వంటి రుణ ఉత్పత్తులపై పరిమితులు విధించాలని ఆర్‌బీఐ ప్రతిపాదించింది. ఈ మార్పులు అమల్లోకి వస్తే బజాజ్ ఫైనాన్స్ సహా పలు NBFCలు తమ రుణ విధానాల్లో కీలక మార్పులు చేయాల్సి వచ్చే అవకాశం ఉంది. ఈ వార్తల నేపథ్యంలో సంబంధిత కంపెనీల షేర్లపై కూడా మార్కెట్లో ఒత్తిడి కనిపించింది.

ఆర్‌బీఐ ప్రతిపాదనలో ప్రధానంగా రివాల్వింగ్ క్రెడిట్ సేవలపై దృష్టి సారించింది. ఈ విధానంలో వినియోగదారులు ఒక నిర్దిష్ట క్రెడిట్ పరిమితి వరకు పలుమార్లు డబ్బును వినియోగించి, తిరిగి చెల్లించిన తర్వాత అదే పరిమితిని మళ్లీ ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. క్రెడిట్ కార్డులు, ఫ్లెక్సీ లోన్లు, క్రెడిట్ లైన్లు వంటి ఉత్పత్తులు ఈ విభాగంలోకి వస్తాయి.

అయితే, ఇప్పటికే ఆర్‌బీఐ నుంచి ప్రత్యేక అనుమతితో క్రెడిట్ కార్డులు జారీ చేస్తున్న NBFCలపై ఈ ప్రతిపాదిత పరిమితులు వర్తించవని కేంద్ర బ్యాంక్ స్పష్టం చేసింది. తుది మార్గదర్శకాలు వెలువడిన తర్వాత ఈ నిబంధనల అమలు విధానం, వినియోగదారులు మరియు NBFCలపై వాటి ప్రభావం మరింత స్పష్టతకు వచ్చే అవకాశం ఉంది.