హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియం వద్ద శనివారం తెల్లవారుజాము నుంచే వేలాది మంది నిరుద్యోగ యువత భారీగా తరలివచ్చారు. హైడ్రా (HYDRAA)లో డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (DRF) అసిస్టెంట్లు, హెవీ వెహికల్ డ్రైవర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడంతో అభ్యర్థులు ఎంపిక ప్రక్రియకు హాజరయ్యేందుకు పోటీపడ్డారు. తెల్లవారక ముందే స్టేడియం, పరిసర ప్రాంతాలు అభ్యర్థులతో కిక్కిరిసిపోయాయి. ఉద్యోగం సాధించాలనే పట్టుదలతో యువత పెద్ద సంఖ్యలో క్యూ లైన్లలో నిలబడటంతో అక్కడ సందడి నెలకొంది.
హైడ్రా విడుదల చేసిన నోటిఫికేషన్ ద్వారా మొత్తం 150 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో 100 డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (DRF) అసిస్టెంట్ పోస్టులు, 50 హెవీ వెహికల్ డ్రైవర్ పోస్టులు ఉన్నాయి. అభ్యర్థుల వయస్సు 35 ఏళ్లకు మించకూడదు. పదో తరగతి ఉత్తీర్ణత తప్పనిసరి కాగా, డ్రైవర్ పోస్టులకు చెల్లుబాటు అయ్యే ఒరిజినల్ హెవీ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. కాంట్రాక్టు ప్రాతిపదికన ఈ నియామకాలు చేపట్టనున్నారు.
ఈ పోస్టులకు ఎంపిక ప్రక్రియలో భాగంగా అభ్యర్థులకు కఠినమైన శారీరక సామర్థ్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. 800 మీటర్ల పరుగును 2 నిమిషాల 50 సెకన్లలో, 100 మీటర్ల పరుగును 15 సెకన్లలో పూర్తి చేయాల్సి ఉంటుంది. అలాగే 4 మీటర్ల లాంగ్ జంప్, 7.2 కిలోల షాట్‌పుట్‌ను 6 మీటర్ల దూరం విసరడం వంటి పరీక్షల్లోనూ ప్రతిభ చూపించాలి. పోస్టులు 150 మాత్రమే ఉన్నప్పటికీ వేలాదిగా యువత తరలిరావడం రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం నిరుద్యోగుల్లో ఉన్న తీవ్ర పోటీకి అద్దం పడుతోంది.

