కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలోని కౌలాస్ నాలా ప్రాజెక్ట్‌కు ఎగువ ప్రాంతాలైన మహారాష్ట్ర, కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. గత రెండు వారాలుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్ట్‌లోకి కొత్త నీరు వచ్చి చేరుతుండటంతో కౌలాస్ నాలా జలకళను సంతరించుకుంది. దీంతో ప్రాజెక్ట్ దాదాపు నిండుకుండలా మారింది.
మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల నుంచి వరద నీరు భారీగా వచ్చి చేరడంతో ప్రాజెక్ట్ నీటిమట్టం క్రమంగా పెరిగింది. దీంతో బిచ్కుంద, పెద్దకొడప్‌గల్, జుక్కల్ మండలాలకు వరప్రదాయినిగా ఉన్న కౌలాస్ నాలా ప్రాజెక్ట్ కళకళలాడుతోంది. ప్రాజెక్ట్‌లోకి వరద నీరు చేరుతుండటంతో పరిసర ప్రాంతాల్లోనూ నీటి వనరులు మెరుగుపడుతున్నాయి.
ప్రాజెక్ట్ ఆయకట్టు కింద సాగు చేస్తున్న అన్నదాతల్లో ప్రస్తుతం ఆనందం వెల్లివిరుస్తోంది. సమృద్ధిగా నీరు లభిస్తుండటంతో పంటల సాగుకు అనుకూల పరిస్థితులు ఏర్పడతాయని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు, ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీరు ఇదే విధంగా కొనసాగితే ప్రాజెక్ట్ ఆయకట్టు పరిధిలోని రైతులకు ఈ సీజన్‌లో సాగునీటి ఇబ్బందులు తగ్గే అవకాశం ఉంది.

