తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి చాందిని చౌదరి.. తాను ఎదుర్కొన్న చేదు అనుభవాలను తాజాగా ధైర్యంగా బయటపెట్టారు. సినిమా అవకాశాల పేరుతో తనను కమిట్‌మెంట్ అడిగిన ఓ వ్యక్తి వ్యవహారాన్ని ఆమె వెల్లడించారు. అంతేకాకుండా తాను అతడి డిమాండ్‌ను తిరస్కరించిన తర్వాత తనపై నెగిటివ్ ప్రచారం చేయడంతో తీవ్రంగా బాధపడ్డానని తెలిపారు. చాందిని చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారాయి.
షార్ట్ ఫిలిమ్స్‌తో కెరీర్‌ను ప్రారంభించిన చాందిని చౌదరి.. 2015లో ‘కేటుగాడు’ సినిమాతో హీరోయిన్‌గా వెండితెరకు పరిచయమయ్యారు. అదే సమయంలో మహేష్ బాబు నటించిన ‘బ్రహ్మోత్సవం’ సినిమాలోనూ ఆమె ఓ చిన్న పాత్రలో కనిపించారు. ఈ సినిమా సమయంలోనే తనకు ఎదురైన ఓ చేదు సంఘటన గురించి ఆమె తాజాగా వివరించారు. అవకాశాల కోసం ఇండస్ట్రీలో ఎదురయ్యే ఒత్తిళ్లు, మహిళా నటీమణులు ఎదుర్కొనే ఇబ్బందులపై ఆమె మాట్లాడారు.
సినిమా అవకాశం ఇప్పిస్తానంటూ వ్యక్తిగత ప్రయోజనాల కోసం కమిట్‌మెంట్ అడగడం తనను తీవ్రంగా కలచివేసిందని చాందిని తెలిపారు. అలాంటి ప్రతిపాదనను అంగీకరించకపోవడంతో తనపై తప్పుడు ప్రచారం చేయడం మరింత బాధ కలిగించిందని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఇలాంటి అనుభవాలు ఎదురైనా తాను వెనక్కి తగ్గకుండా తన కెరీర్‌పై దృష్టి పెట్టానని ఆమె స్పష్టం చేశారు. చాందిని చౌదరి చేసిన ఈ వ్యాఖ్యలు మరోసారి సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ అంశంపై చర్చకు దారితీశాయి.

