Uncategorized

తెలంగాణ బీజేపీ నేతలపై భగ్గుమన్న హైకమాండ్..! కారణం అదేనా..?

తెలంగాణ బీజేపీలో నేతల తీరు మరోసారి చర్చనీయంశంగా మారింది. వచ్చే ఎన్నికలో గెలుపే లక్ష్యంగా పనిచేయాలంటూ జాతీయ నాయకత్వం ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తూనే ఉంది. రాష్ట్ర పర్యటనకు జాతీయ నేతలు వచ్చినా, రాష్ట్ర నాయకులు ఢిల్లి వెళ్లినా నేతల తీరుపై క్లాస్ లు తీసుకోవడం రొటీన్‌గా మారిందంటున్నారు. ప్రధాని మోదీ నుంచి సునీల్ బన్సల్ వరకు అంతా రాష్ట్ర నాయకుల తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు పార్టీ కార్యాలయంలో టాక్ నడుస్తోందట. జాతీయ నాయకులు ఎంత చెప్పినా నేతల తీరులో మార్పురావడం లేదన్న చర్చ ఢిల్లీ స్థాయిలోనూ జరుగుతోందంటున్నారు. మీరు మారే వరకు మీకు పదవులు కూడా ఇవ్వలేమని  విధంగా .. జాతీయ కార్యవర్గంలో చోటు దక్కకపోవడాఇన్ని ఉదాహరణగా చూడొచ్చు.

నేతల ఆధిపత్య పోరు..

పదవులు ఇవ్వకుండా పక్కన పెడితే అయినా వారిలో మార్పు వస్తుందన్న అంచనాలో ఉన్నారట జాతీయ నేతలు. అయితే మీరేం చేసినా మేం మారేది లేదు అన్నట్లుగా ఇక్కడ వీరి వ్యవహార శైలి ఉంటోంది. ముఖ్యంగా పార్టీ నుంచి గెలిచిన ప్రజాప్రతినిధుల మధ్య ఆధిపత్య పోరే ఇందుకు కారణమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. భవిష్యత్తులో పార్టీ ఎదుగుదల కోసం కృషి చేయాల్సిన ప్రజాప్రతినిధుల మధ్యే ఇలా సఖ్యత లేకపోతే కేడర్ కు పార్టీపై ఎలాంటి అభిప్రాయం ఉంటుందన్న చర్చ కూడా జరుగుతోంది. కార్యకర్తల కష్టంతో ఎన్నికల్లో గెలిచిన వారు ఇప్పుడు ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నారంటూ కేడర్ లో కూడా అసంతృప్తి వ్యక్తం అవుతోంది.

ప్రస్తుతం బీజేపీ జాతీయ నాయకత్వం ఇచ్చిన పిలుపు మేరకు తెలంగాణ లో ప్రజాస్వామ్య పరిరక్షణ ర్యాలీలకు సిద్ధమవుతున్నారట నేతలు. ఇప్పటికే ఇటు హైదరాబాద్‌లో, అటు నిర్మల్‌లో ఈ యాత్రలు నిర్వహించారు. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక ర్యాలీ నిర్వహించి ఈ ర్యాలీ లకు జాతీయ నాయకులు ముఖ్య అతిథులుగా పిలవాలని నిర్ణయించిందంట రాష్ట్ర నాయకత్వం. అయితే తమకు ఎవరు గెస్ట్ గా రావాలనేది ఆయా నియోజకవర్గాల్లోని ఎంపీలు నిర్ణయించుకుంటున్నారు. ఎంపీలు లేనిచోట రాష్ట్ర నాయకత్వమే నేరుగా అందుబాటులో ఉన్న జాతీయ నాయకులను పాదయాత్రకు రావాలంటూ సమయం తీసుకుంటోంది. పార్లమెంట్ సభ్యులు ఉన్న చోటనే అసలు సమస్య ఎదురవుతోందట. పార్టీ లోని ఇద్దరు ఎంపీలు జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ను పాదయాత్రకు రావాలంటూ ఆహ్వనిస్తున్నారట.

ఎంపీ, కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇప్పటికే నితిన్ నబీన్ ను కలిసి కరీంనగర్‌లో నిర్వహించే మహా పాదయాత్రకు రావాలంటూ ఆహ్వానించారు. దీంతో కరీంనగర్ కు వచ్చేందుకు సిద్దమయ్యారట ఆయన. అయితే నిజామాబాద్‌లో నిర్వహించే ప్రజాస్వామ్య పరిరక్షణ పాదయాత్రలో నితిన్ నబీన్ పాల్గొంటారని ప్రకటించారు ఎంపీ అర్వింద్‌. ఇందుకు తానే స్వయంగా ఆయనను కలిసి ఆహ్వానిస్తానని ముందస్తుగానే ప్రకటించారు ఆయన. దీంతో ఆయన ఎవరి పాదయాత్రలో పాల్గొంటారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. ఒకే రోజు రెండు పాదయాత్రలలో పాల్గొనడం సాధ్యం అవుతుందా? అన్నది పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఒక వేళ వేర్వేరు తేదీలలో పాదయాత్ర నిర్వహిస్తే అంత స్వల్ప గ్యాప్ లో రెండు సార్లు రాష్ట్ర పర్యటనకు వచ్చేందుకు జాతీయ అధ్యక్షుడి కి సాధ్యమేనా? అన్నది కూడా పార్టీ వర్గాల్లో చర్చకు దారి తీసిందట.