పశ్చిమ బెంగాల్‌లో వందేభారత్ ఎక్స్‌ప్రెస్ (Vande Bharat Express)పై వరుసగా రెండో రోజు రాళ్ల దాడి జరిగింది. RPF ప్రకారం.. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ C3, C6 కోచ్‌ల అద్దాలు రాళ్లదాడి కారణంగా దెబ్బతిన్నాయి. రైలు డార్జిలింగ్ జిల్లాలోని ఫన్‌సిదేవా సమీపంలోని న్యూ జల్‌పైగురి వైపు వెళుతుండగా కిటికీలు దెబ్బతిన్నాయి. అంతకుముందు.. పశ్చిమ బెంగాల్‌లో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభమైన రెండవ రోజునే దానిపై రాళ్ల దాడి ఘటన వెలుగులోకి వచ్చింది. సమాచారం ప్రకారం.. మాల్దాలోని కుమార్‌గంజ్ స్టేషన్ సమీపంలో హౌరా- న్యూ న్యూ జల్‌పైగురిల మధ్య నడుస్తున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో కొందరు దుండగులు రైలుపై రాళ్లతో దాడి చేశారు. ఈ రాళ్ల దాడిలో వందేభారత్ ఎక్స్‌ప్రెస్ కోచ్ నంబర్-13 కిటికీ అద్దానికి పగుళ్లు ఏర్పడ్డాయి. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై బీజేపీ నేత శుభేందు అధికారి ఎన్‌ఐఏ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సమక్షంలో డిసెంబర్ 30, 2022న హౌరా- న్యూ జల్‌పైగురిలను కలుపుతూ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రధాని నరేంద్ర మోదీ జెండా ఊపి ప్రారంభించారు. ఈ ఘటన కొద్దిరోజుల తర్వాత వెలుగులోకి వచ్చింది. భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రారంభోత్సవం సందర్భంగా దేశానికి స్వాతంత్య్రం వచ్చిన ‘అమృత్ మహోత్సవ్’లో దేశం 475 వందే భారత్ రైలును ప్రారంభించాలని సంకల్పించిందని ప్రధాని మోదీ చెప్పారు. హౌరా నుండి న్యూ జల్‌పైగురిని కలుపుతూ వందే భారత్ ఒకటి ప్రారంభమైంది. ఇంతకు ముందు కూడా సెమీ హైస్పీడ్ రైలు వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌పై రాళ్ల దాడి ఘటనలు జరిగాయి. 15 డిసెంబర్ 2022న ఛత్తీస్‌గఢ్‌లోని నాగ్‌పూర్-బిలాస్‌పూర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలుపై రాళ్లు విసిరారు. దీని కారణంగా రైలు కిటికీ అద్దాలు దెబ్బతిన్నాయి. అయినప్పటికీ ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. దుర్గ్- భిలాయ్ స్టేషన్ల మధ్య ఈ ఘటన జరిగింది. ఈ ఘటనకు నాలుగు రోజుల ముందు ప్రధాని నరేంద్ర మోదీ నాగ్‌పూర్-బిలాస్‌పూర్ వందే భారత్ రైలును జెండా ఊపి ప్రారంభించారు.