World

జెరూసలేం ఓల్డ్ సిటీ లో 13 ఏళ్ల పాలస్తీనా బాలుడు విచక్షణ రహితంగా కాల్పులు

జెరూసలేం ఓల్డ్ సిటీ లో 13 ఏళ్ల పాలస్తీనా బాలుడు విచక్షణ రహితంగా కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో 47 ఏళ్ల ఇజ్రాయెలీ వ్యక్తి, ఆయన కుమారుడు తీవ్రంగా గాయపడ్డారు. ఒక కారు వెనుక దాక్కుని అక్కడి యూదుల ప్రార్థన స్థలానికి వెళ్తున్న తండ్రీకొడుకులపై ఆ బాలుడు కాల్పులు జరిపాడు. అనంతరం, అక్కడి సాయుధులు ఆ బాలుడిపై కాల్పులు జరపడంతో ఆ బాలుడు కూడా తీవ్రంగా గాయపడ్డాడు.

ప్రార్థన స్థలం లో.. మరో ఘటనలో జెరూసలేంలోని ఒక ప్రార్థన స్థలం వెలుపల తుపాకీతో ఒక 21 ఏళ్ల పాలస్తీనా వ్యక్తి విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో ఏడుగురు ఇజ్రాయెలీలు ప్రాణాలు కోల్పోయారు. ఈ రెండు ఘటనలతో ఇజ్రాయెల్, పాలస్తీనా సంబంధాలు మరింత దిగజారాయి. ఉగ్రవాద సంస్థలు చిన్న పిల్లలను ఉగ్ర దాడులకు పురిగొల్పుతున్నాయని స్థానిక పోలీసులు తెలిపారు. వెస్ట్ బ్యాంక్ లోని జెనిన్ ప్రాంతంలో గురువారం పాలస్తీనా సాయుధులకు, ఇజ్రాయెల్ సైనికులకు జరిగిన ఘర్షణల్లో 9 మంది పాలస్తీనా సాయుధులు చనిపోయారు. దాంతో, ఈ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.